తల్లిదండ్రులు మందలించారని చిన్నారులు పరారీ
తల్లిదండ్రులు మందలించారని చిన్నారులు పరారీ రేపల్లె: తల్లిదండ్రులు మందలించారని ఇరువురు చిన్నారులు ఇంటి నుంచి పారిపోయిన సంఘటన రేపల్లె మండలం పేటేరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు... పేటేరు పంచాయతీ బావాజీపాలేనికి చెందిన దిట్ల గోపయ్య, సంధ్యారాణిల కుమారులు రాజ్‌కుమార్, జాషువాలు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలులో 8, 3 తరగతులు చదువుతున్నారు. ఆడుకోవటానికి చిన్నారులకు తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోవటంతోపాటు మందలించడంతో అలిగిన చిన్నారులు మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో తమ సైకిళ్లను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎంతసేపటికీ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవటంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టు ప్రక్కల, బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించటంతోపాటు సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను సేకరించారు. చిన్నారుల ఆచూకీని కనుగొనేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల ఆచూకీ తెలిసిన వారు పోలీసుస్టేషన్‌లో తెలియజేయాలని సీఐ కోరారు.
ఆర్టీసీ తిరునాళ్ల ఆదాయం రూ.1.50 కోట్లు
నరసరావుపేట: కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్టీసీకి రూ.1.50కోట్ల ఆదాయం లభించినట్లు ఆ సంస్థ జిల్లా ప్రజారవాణా అధికారి టి.అజితకుమారి చెప్పారు. మంగళవారం ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. మహా శివరాత్రికి జిల్లా వ్యాప్తంగా 460 బస్సులను నడపటం ద్వారా 4.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయటం జరిగిందన్నారు. గతేడాదిలో 4 లక్షల మంది ప్రయాణికులను చేరవేయటం ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం లభించిందన్నారు. నరసరావుపేట డిపో ద్వారా మూడు లక్షల మంది ప్రయాణికులను కొండకు చేరవేయటం ద్వారా రూ.90 లక్షల ఆదాయం రాగా గతేడాది 2.89 లక్షల మంది ప్రయాణికులను చేరవేసి రూ.71లక్షల ఆదాయం వచ్చిందన్నారు. చిలకలూరిపేట బస్‌డిపో ద్వారా 65 వేల మంది ప్రయాణికులను చేరవేసి రూ.12.50 లక్షల ఆదాయం వచ్చిందని, గతేడాది రూ.17లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. వినుకొండ డిపో ద్వారా 16వేల మంది భక్తులను కొండకు చేరవేయటం ద్వారా రూ.12.50 లక్షల రాగా, గతేడాది 7,200 మంది ప్రయాణికుల ద్వారా రూ.9.20 లక్షల ఆదాయం సమకూరిందని ఆమె తెలిపారు.