రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
● ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్‌ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి


