భూమిని కాజేసేందుకు చంద్రబాబు కుట్ర
వక్ఫ్ భూముల జోలికొస్తే సహించేది లేదు ఎమ్మెల్సీ మురుగుడు, సమన్వయకర్త దొంతిరెడ్డి, గుంటూరు తూర్పుసమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా
రూ.2వేల కోట్ల విలువైన
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న 72 ఎకరాల అంజుమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన వ్యవసాయ భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా విమర్శించారు. గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని షేక్ నూరి ఫాతిమా నివాసం నుంచి మంగళగిరికి భారీగా ర్యాలీతో తరలివచ్చారు. చినకాకానిలో ఉన్న వక్ఫ్ భూములను ఆదివారం వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమాలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీవోలతో వక్ఫ్ భూములను కాజేయడానికి యత్నిస్తోందని, ఆ భూములను బడా వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసేందుకే ఈ కుట్ర అని అన్నారు. ఇప్పటికే రాజధానిలో అభివృద్ధి పేరుతో వేల ఎకరాలను ప్రభుత్వం తీసుకుందని రెండు సంవత్సరాలు గడిచినా అభివృద్ధి శూన్యమని అన్నారు. ముస్లిం సంస్థలకు చెందిన స్ధిరాస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
చలో కలెక్టరేట్‌కు తరలిరండి
ఈనెల 9న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని షేక్ నూరి ఫాతిమా కోరారు. ఈ భూములపై ఆధారపడిన పాఠశాల, మసీదు, రైతులు, షాదీఖానాలకు సంబంధించిన అందరి వద్ద నుండి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కలెక్టర్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం, గ్రీవెన్స్‌లో అభ్యంతర పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి పట్టణ, మండల అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, అమరా నాగయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతి, వైఎస్సార్ సీపీ జిల్లా, మండల, పట్టణ మైనార్టీ నాయకులు సుభాని, చాంద్‌బాషా, మాలిక్‌బాబు, యస్‌కె షఫీ, హుస్సేన్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు మౌలా బేగ్, హాజీ మహమ్మద్, షేక్ హుస్సేన్, షేక్ సమీవుల్లా, గుంటూరు వైఎస్సార్‌సీపీ నాయకులు పటాన్ సైదాఖాన్, ఖాసిం బేగ్, లియాఖత్ అలీ, సలీమ్, కరీమ్, కార్పొరేటర్ బాబు, రాజేష్, జానీ బాషా, సుభాని, రబ్బాని, శ్రీకాంత్‌రెడ్డి, అమీనా షరీఫుద్దీన్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.


