అంతర్రాష్ట్ర లాప్‌ట్యాప్‌ల దొంగ అరెస్ట్
● యూనివర్సిటీ హాస్టళ్లే టార్గెట్ ● 11 రాష్ట్రాల్లో 61 కేసులు నమోదు ● నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన 15 లాప్‌ట్యాప్‌లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ
మంగళగిరిటౌన్: దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ హాస్టళ్లను టార్గెట్ చేసుకుని విద్యార్థుల లాప్‌ట్యాప్‌లను అపహరించే నిందితుడిని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 15 లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ గురువారం విలేకరుల సమావేశం నిందితుడి వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా పులివలం గ్రామానికి చెందిన తమిళ్ సెల్వన్ న్యాయవిద్యను అభ్యసించి లాప్‌ట్యాప్‌ల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని అమృత యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హాస్టళ్లలో డిసెంబర్ 31వ తేదీ 5 లాప్‌ట్యాప్‌లను అపహరించుకుపోయాడు. ఆయా యూనివర్సిటీల అధికారుల ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడు తమిళ్ సెల్వన్‌ను గురువారం మండల పరిధిలోని డాన్‌బాస్కో ఉన్నత పాఠశాల సమీపంలో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి కొన్ని లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా మరికొన్ని లాప్‌ట్యాప్‌లు విజయవాడ సమీపంలో ఉంచినట్లు సెల్వన్ తెలపడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు లాప్‌ట్యాప్‌లను విజయవాడలో విక్రయించేందుకు ఈనెల 2వ తేదీ సెల్వన్ విజయవాడ వచ్చాడని, మంగళగిరి పరిసర ప్రాంతంలోని పలు యూనివర్సిటీల్లో కూడా దొంగతనాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. విట్ కాలేజీలో దొంగతనం చేయడానికి వెళుతున్న సెల్వన్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీల్లో దొంగతనాలు చేసిన లాప్‌ట్యాప్‌లను ముంబయి, ఢిల్లీ, చైన్నె వంటి ప్రాంతాల్లో అమ్మేవాడని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఓలా, ఓబర్ వంటి యాప్‌ల ద్వారా వాహనాలను బుక్‌చేసుకుని ఆయా యూనివర్సిటీలకు చేరుకునేవాడని, హాస్టల్‌లో స్టూడెంట్‌గా జాయిన్ అయ్యేందుకు వచ్చినట్లు చెప్పి విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో లాప్‌ట్యాప్‌లను అపహరించుకు వెళ్లేవాడని తెలిపారు.
పగ నుంచి మొదలై... వృత్తిగా ఎంచుకునే వరకు...
మంగళగిరి రూరల్ పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళ్ సెల్వన్‌కు మెడికల్‌కాలేజీలో చదువుకునే విద్యార్థిని ఫ్రెండ్‌గా ఉండేదని, తనను తోటి వైద్య విద్యార్థులు మానసికంగా వేధించి ఇబ్బందులకు గురిచేశారని, వారిపై పగ తీర్చుకునేందుకే లాప్‌టాప్ దొంగతనాలు మొదలు పెట్టినట్లు చెప్పాడు. మొదట అదే కళాశాలలో మొదలు పెట్టిన దొంగతనాలు నేడు వృత్తిగా ఎంచుకుని పలు యూనివర్సిటీ హాస్టళ్లలో దొంగిలించాడు. 11 రాష్ట్రాల్లో సెల్వన్‌పై కేసులు నమోదైనట్లు తెలిపారు. సుమారు 61 లాప్‌ట్యాప్‌లు దొంగిలించిన కేసుల్లో నిందితునిగా ఉన్నాడని వెల్లడించారు. సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్‌ఐలు చిరుమామిళ్ల వెంకట్, రవితేజ, ఎస్‌ఎస్‌ఐ రత్నరాజు, సిబ్బంది సాగర్, నాగుల్ మీరా పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర లాప్‌ట్యాప్‌ల దొంగ అరెస్ట్


