‘ఓపెన్‌’ చేసేశారు | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ చేసేశారు

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

‘ఓపెన్‌’ చేసేశారు

‘ఓపెన్‌’ చేసేశారు

స్క్వాడ్‌ విషయం నాకు తెలియదు

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) దూర విద్యాకేంద్రం నిర్వహిస్తున్న పలు పరీక్షలు గాడితప్పాయి. కేంద్రాల నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి విచ్చలవిడిగా చూచిరాతలకు ద్వారాలు తెరిచేశారు. మరి కొన్ని కేంద్రాల్లో అభ్యర్థులే మారిపోయారంటే ఎంతలా ఓపెన్‌ చేశారో స్పష్టమవుతోంది. ఏఎన్‌యూ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దూరవిద్యాకేంద్రం డిగ్రీ, పీజీ తదితర కోర్సుల పరీక్షలను స్క్వాడ్‌ తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇదీ విషయం దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్న పలు సెంటర్ల నిర్వాహకులు కొందరు అధికారులను మేనేజ్‌ చేస్తూ విద్యార్థుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారం చేస్తున్న వారు కావడంతో కోర్సు పూర్తికావాలనే ఆలోచనతో సెంటర్ల నిర్వాహకులు అడిగినంత ముట్టచెబుతున్నారు.

సెల్‌ఫోన్లు.. పుస్తకాలు పెట్టి మరీ

గుంటూరు సమీపంలోని గోరంట్ల దూరవిద్య పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్లు ఎదురు పెట్టుకుని పరీక్షలు రాయడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లిన అబ్జర్వర్లను మీరు వచ్చింది రెగ్యులర్‌ పరీక్షలకు కాదు.. డిస్టెన్స్‌ పరీక్షలకు అని నిర్వాహకులు బెదిరింపులకు దిగడం విస్తుగొలుపుతోంది.

తనిఖీలతో వెలుగులోకి చూచిరాత పర్వం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో గత నెల 31 నుంచి దూర విద్యాకేంద్రం రెండో విడత పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు దూరవిద్య పరీక్షల సమన్వయకర్తకు సంబంధం లేకుండా స్క్వాడ్‌ బృందాన్ని నియమించారు. ఈ బృందం గత నెల 31న కడప జిల్లా మైదుకూరులోని ఓ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చూచిరాతకు పాల్పడుతున్న సుమారు పదిమందిని పట్టుకున్నారు. వీరితో పాటు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న మరి కొంతమందిని పట్టుకొని మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశారు.

అనంతపురంలో 60 మందిపై ..

ఈనెల 1వ తేదీన అనంతపురంలోని ఓ పరీక్షా కేంద్రాన్ని స్క్వాడ్‌ తనిఖీ చేసి చూసి రాతకు పాల్పడుతున్న సుమారు 60 మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశారు. అదే రోజు అనంతపురం పట్టణంలోని మరో కేంద్రాన్ని తనిఖీకి వెళ్లగా పక్క కేంద్రంలో స్క్వాడ్‌ తనిఖీల సమాచారాన్ని తెలుసుకున్న నిర్వాహకులు విద్యార్థులను ముందుగానే పరీక్ష కేంద్రం నుంచి పంపించి వేసినట్లు తెలిసింది. స్క్వాడ్‌కు పరీక్ష గదుల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ముందుగానే విద్యార్థులను ఎలా పంపిస్తారని స్క్వాడ్‌ సభ్యులు పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించగా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

2న గుంటూరులో..

స్క్వాడ్‌ ఈనెల రెండో తేదీన గుంటూరు నగరాన్ని ఆనుకుని ఉన్న గోరంట్లలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి చూచిరాతకు పాల్పడుతున్న కొంతమంది విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ కేంద్రంలో నియమించిన అబ్జర్వర్‌ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని గుర్తించారు.

కడియం పరీక్ష కేంద్రం అబ్జర్వర్‌గా అర్హత లేని వ్యక్తి

స్క్వాడ్‌ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం సమీపంలోని ఓ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి చూసి రాతకు పాల్పడుతున్న కొంతమంది విద్యార్థులను పట్టుకున్నారు. ఆ కేంద్రంలో నియమించిన అబ్జర్వర్‌ విశ్వవిద్యాలయంలోని ఓ కేంద్రంలో ప్రోగ్రామర్‌ (నాన్‌ టీచింగ్‌ ఉద్యోగి)గా పని చేస్తున్నారు. ఇతను అనర్హుడైనప్పటికీ విశ్వవిద్యాలయంలో అధికార పార్టీ కార్యక్రమాలు చేయడంతో అతిపెద్ద పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్‌గా నియమించారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి సమీపంలోని గోకవరం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా అబ్జర్వర్‌ విధుల్లో లేకపోవడంతో స్క్వాడ్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో చూచిరాతలు

ఆకస్మిక తనిఖీలతో వెలుగులోకి బాగోతం

విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

స్క్వాడ్‌కు సెంటర్ల నిర్వాహకుల బెదిరింపులు

దూరవిద్య పరీక్షల తనిఖీకి స్క్వాడ్‌ నియామకానికి ఫైలు పంపించాను. ఉన్నతాధికారులు ఎవరిని నియమించారో నాకు సమాచారం లేదు. స్వ్కాడ్‌ బృందం ఎక్కడకి వెళ్లారు.. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన వారి వివరాలు నాకు చెప్పాలి. కానీ ఆ వివరాలు నాకు ఇవ్వలేదు. నాకు సమాచారం ఇస్తే ఆ కేంద్ర గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉండేది. స్వ్కాడ్‌ తనిఖీల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచామని వర్సిటీ ఉన్నతాధికారులు నాతో చెప్పారు.

– రామచంద్రన్‌, ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement