నేటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్–2కే26
●జాతీయ స్థాయిలో 80 అంశాల్లో పోటీలు
●విజేతలకు రూ.15 లక్షలకు పైగా
నగదు బహుమతులు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న యూత్ ఫెస్టివల్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26కు సన్నాహాలు పూర్తయ్యాయని ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం జరిగే ప్రారంభ వేడుకలకు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కొమండూరి రామాచారి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 7వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు 2025 ఏసియన్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రకటించారు. మహోత్సవ్‌లో రెండో రోజున ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, మూడో రోజున ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి సందడి చేస్తారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. పోటీల విజేతలకు మొత్తం రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో మొత్తం 80కు పైగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. విజ్ఞాన్ మహోత్సవ్ కేవలం పోటీలకే పరిమితం కాకుండా, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే మహా వేదికగా నిలుస్తుందని ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. రిజిస్ట్రార్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.


