పీఏసీఎస్ ఉద్యోగుల ‘వంట–వార్పు’
కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్‌లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్‌ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏడోరోజు వినూత్న నిరసన
తెల్పిన ఉద్యోగులు


