ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు
ప్రజాప్రతినిధుల సమక్షంలో రెచ్చిపోయిన కార్యకర్తలు టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి మధ్య వివాదంలో జనసేన ఎందుకు? అంబటి ఇంటిపై దాడి తీరు చూసి న్యాయమూర్తులు సైతం దిగ్భ్రాంతి హైకోర్టు న్యాయవాది కన్నా రజిని
గుంటూరు వెస్ట్: ప్రజాస్వామ్య దేశంలో దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జనసేన అధికార ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కన్నా రజిని పేర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి మాజీ మంత్రి అంబటిపైన, ఆయన నివాసం ధ్వంసంపైన ఆమె స్పందించారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే జరుగుతోందన్నారు. ఇందులో జనసేనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వ ధర్మానికి కట్టుబడి తాను జనసేన పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. పోలీసులు ఉండగానే టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని అంబటిపై దాడికి దిగడం సరికాదన్నారు. ఒక మాటలో చెప్పాలంటే పోలీసు వ్యవస్థను సైతం అధికార పార్టీ శాసిస్తోందన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త గళ్లా రామచంద్రరావు స్వయంగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి కార్యకర్తలను ప్రొత్సహించడం సరికాదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని, వారు వ్యవహరించిన తీరు న్యాయమూర్తులను సైతం విస్తుపోయేటట్లు చేసిందని తెలిపారు. రాజకీయాలన్న తరువాత కొన్ని చోట్ల కార్యకర్తలు దురుసుగా వ్యవహరించడం జరుగుతుంటుందన్నారు. వాటిని ఖండించాల్సిన బాధ్యత సంబంధిత నాయకులదేనని పేర్కొన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు దూకుడును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించిన సందర్భాలను రజిని గుర్తు చేశారు. అంబటిపైగానీ, ఆయన నివాసంపైగానీ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలలో ఎవరూ ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పిన కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.


