విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తెనాలిలో పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని ప్రారంభించిన మంత్రి
తెనాలి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల్లో అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభించారు. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూలులో సాయంత్రం ఏర్పాటైన సభకు కార్యక్రమ నోడల్ అధికారి సునీల్ నాయక్ అధ్యక్షత వహించారు. నియోజకవర్గంలోని 325 మంది పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్లను అందజేశారు. ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అంధత్వ నివారణ కార్యక్రమంలో రాష్ట్రంలోని విద్యార్థులకు కంటిపరీక్షలు, కళ్లజోళ్లు పంపిణీనే కాకుండా అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. శస్త్రచికిత్సలూ చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు రూపొందించి, అన్ని వివరాలను పొందుపరుస్తున్నట్టు చెప్పారు. రక్తహీనత కలిగిన 9 లక్షలమందికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నామని, 18 లక్షల బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్‌ను పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. క్యాన్సర్‌కు సంబంధించి గొంతు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను చేస్తున్నట్టు చెబుతూ ఎవరినైనా నిర్ధారణ జరిగితే రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీని తెనాలిలో ఆరంభించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సౌరబ్ గౌర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రావణబాబు, ఆర్‌డీ డాక్టర్ శోభారాణి, బీజేపీ, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, గాదె వెంకటేశ్వరరావు, జనసేన కౌన్సిలర్లు జి.మానసారెడ్డి, వసంతరావు, జయపాల్ స్థానిక అధికారులు బి.జనార్ధనరావు, కేవీ గోపాలరావు, జె.రామఅప్పలనాయుడు పాల్గొన్నారు.
తిరుమల లడ్డూలో నెయ్యే లేదు
తెనాలి: తిరుమల లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పామాయిల్‌తోనే లడ్డూలు చేశారనీ, ఆవిధంగా పవిత్రతను తగ్గించడమే కాకుండా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తెనాలిలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, తన ప్రసంగం ఆరంభంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు.


