ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని 79 కేంద్రాలలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాలలో జిల్లావ్యాప్తంగా మంగళవారం 4,790 మంది విద్యార్థులకు గాను 4,591 మంది హాజరు కాగా మరో 199 మంది గైర్హాజరయ్యారు. గురజాలలోని మూడు పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్భందీగా ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్క్వాడ్ బృందాలు పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
మార్కెట్ కమిటీ పూర్తి స్థాయి నియామకం
కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్‌గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్‌బాయి, బత్తుల జాన్‌సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.


