నేను బతికే ఉన్నానండీ..
వంగర హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో, ఉన్నతాధికారులకు ఫిర్యాదు తనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో పొలం మార్పుపై విస్మయం బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వినతి
తాడికొండ: నేను బతికే ఉన్నానని...చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆన్‌లైన్‌లో భూమి వివరాలు తొలగించిన వ్యక్తులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ వంగర హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి కోరారు. ఆయన శుక్రవారం తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21న సాక్షిలో ‘బతికుండగానే చంపేశారు’ పేరిట ప్రచురితమైన కథనానికి రాజధాని సాక్షిగా జరిగిన రెవెన్యూ మాయాజాలం వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న 80 సంవత్సరాల వృద్ధుడు హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాను మెయిల్స్ ద్వారా సీఎస్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ, సీఐ ఇతర అధికారులను కూడా కలిసినట్లు తెలిపారు. తనకు సర్వే నెంబర్ 1051లో 1.70 ఎకరాలు, సర్వే నెంబర్ 1150లో 8.32 ఎకరాలు కలిపి మొత్తం 10.02 ఎకరాల భూమి ఉందన్నారు. పత్రికలలో వచ్చిన కథనాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఆన్‌లైన్‌లో చూస్తే కానీ తమకు విషయం బయటపడలేదని అన్నారు. తనకు వారసులు లేరని, తాను ఎవరికీ వీలునామా రాయడంకానీ, బదిలీ చేయడం కానీ జరగలేదన్నారు. తప్పుడు పత్రాలతో తాను మరణించినట్లు చూపించి భూమి బదలాయింపు వెనుక ఉన్న వ్యక్తులెవరో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.


