చేబ్రోలులో నకిలీ పోలీసు అరెస్ట్
విద్యార్థిని వద్ద బంగారు గొలుసు కాజేసిన నిందితుడు
చేబ్రోలు: విద్యార్థినిని బెదిరించి బంగారు గొలుసును అపహరించుకుపోయిన నకిలీ పోలీసును చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పి. వీరనారాయణ గురువారం కేసు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్న కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన యువకుడు ఈ నెల 21వ తేదీన తన స్నేహితురాలితో కలిసి పొన్నూరులోని ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్లారు. అనంతరం వడ్లమూడి గ్రామ సమీపంలోని చెరుకు రసం షాపు వద్ద ఆగి మాట్లాడుతున్న సమయంలో పోలీసునని చెప్పి ఓ వ్యక్తి బెదిరించాడు. సీఐ వద్దకు తీసుకువెళ్లాలని చెప్పటంతో వారు భయపడ్డారు. వడ్లమూడి అడ్డరోడ్డు నుంచి శలపాడు వెళ్లే దారిలోకి తీసుకువెళ్లి కేసును మాఫీ చేయాలంటే రూ.రెండు లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేవు అని చెప్పటంతో విద్యార్థిని మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని మాయమయ్యాడు. నకిలీ పోలీసు అని గుర్తించి మరునాడు వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా నిందితుడిని పెదనందిపాడు ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ బాషాగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు రూ.రెండు లక్షల విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. జులాయిగా తిరుగుతున్న రసూల్ బాషాపై ప్రకాశం జిల్లాలో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.


