27న టీటీడీ దేవస్థానానికి సీఎం రాక
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
తాడికొండ: ఈ నెల 27వ తేదీన తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పా ట్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. ఆలయంలో నిర్మించబోయే రెండవ ప్రాకార నిర్మాణానికి సంబంధించి జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చేపట్టవలసిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలెక్టర్ చర్చించారు.
తెనాలి: భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈనెల 27వ తేదీన తెనాలి రానున్నారు. ఆరోజు స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ సంఘసేవకుడు పెమ్మరాజు దుర్గాకామేశ్వరరావు అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సత్కార గ్రహీత దుర్గాకామేశ్వరరావుకు భారతజ్యోతి బిరుదును మాజీ ఉపరాష్టపతి చేతులమీదుగా అందజేస్తామని వివరించారు. దుర్గాకామేశ్వరరావుపై రూపొందించిన సంచికను అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరిస్తారు. తెనాలి ప్రచురణలు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో ఓలేటి పార్వతీశం, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.


