ఘనంగా కెనరా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): కెనరా బ్యాంక్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయం వ్యవస్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు జయంతి సందర్భంగా 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు ప్రాంతంలోని 74 శాఖలలో ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాంతీయ అధికారి డి.రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థాపకుడు సుబ్బారావు స్ఫూర్తి, ఆయన విలువలు, కెనరా బ్యాంక్ సేవల గురించి వివరించారు. బ్యాంకు సిబ్బంది, అధికారులు సేవా భావంతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. గుంటూరు నగరంలోని సంగడిగుంట, ఎంఎస్‌ఎంఈ సులభ్ ప్రాంగణంలో కొత్త కార్యాలయాలను విజయవాడ సర్కిల్ హెడ్, జనరల్ మేనేజర్ విజయలక్ష్మి, డెప్యూటీ జనరల్ మేనేజర్ అనంత పద్మనాభ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు రీజియన్ హెడ్ రాజ్‌కుమార్, డివిజనల్ మేనేజర్ డి. శ్యామల, బ్రాంచ్ మేనేజర్ తమనమ్ రాజేంద్ర, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు.


