పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొరిటెపాడు(గుంటూరు):గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో నల్లపాడు రోడ్‌లోని శ్రీ వెకటేశ్వర ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లులో మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఎం.విజయ సునీత బుధవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గుంటూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండలలో నాలుగు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ఆరుదలతో కూడిన నాణ్యమైన పత్తిని తీసుకువెళ్లి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 పొందాలని సూచించారు. పత్తిని ప్లాస్టిక్ సంచుల్లో కాకుండా లూజు రూపంలో ఆరబెట్టుకుని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా 12 శాతం కంటే తక్కువ తేమ శాతం గల పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని కోరారు. మధ్యవర్తులు, దళారుల వద్దకు పత్తి రైతులు వెళ్ళకుండా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో కనీస మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, డీడీఎం ఎం.దివాకరరావు, ఏడీఎం పి.సత్యనారాయణ చౌదరి, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, సీసీఐ బయ్యర్లు రవీంద్ర, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


