నేడు చేస్తుందేమిటి?
అమరావతి విషయంలో చెప్పిందొకటి, చేసేది ఇంకొకటి
రైతుల సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు
సీఎం సానుకూలమంటారు.. కలవనీయరు
మంత్రి నారాయణ పట్టించుకోరు
సీఆర్డీఏ అధికారులది చిన్నచూపు
అమరావతి ఐకాస నేతల ఆగ్రహం
ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని అల్టిమేటం
సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలి.
గ్రామ కంఠాల సమస్య, జరీబు భూముల సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు.
రాజధాని రహదారుల కోసం తీసుకుంటున్న భూముల రైతుల డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
భూములు ఇచ్చింది అధికారులతో మాటలు పడటానికి కాదు. సీఆర్డీఏ స్థాయిలో సమస్యలను కూడా ముఖ్యమంత్రికే చెప్పుకోవాలంటే ఇక సీఆర్డీఏ ఎందుకు?
గ్రీవెన్స్ డే రోజు వెళ్లి అర్జీ ఇస్తే చెత్త బుట్టలో పడేస్తున్నారు. రాజధాని ఉద్యమంలో పెట్టిన కేసుల్ని తొలగించలేదు.
ల్యాండ్ పూలింగ్‌లో లేని భూముల్లో ప్లాట్లు కేటాయిస్తే వాటిని ఏం చేయాలనే విషయం ఇంతవరకు తేల్చలేదు.
మేం భూములిచ్చి పదేళ్లు దాటినా సమస్యలు పరిష్కరించటంలేదు. ప్రభుత్వం భూములిచ్చిన కంపెనీలకు మాత్రం వెనువెంటనే అనుమతులు మంజూరు చేయడం ఏమిటి?
భూములిచ్చిన మాకు న్యాయం చేయకుండా మరో విడత పూలింగ్‌కు వెళితే మా పరిస్థితి ఏమిటి? ఇక్కడి భూములకు ధరలు పడిపోతాయని, దీన్ని సమర్థించబోమని గతంలోనే స్పష్టం చేశాం.
నాడు చెప్పిందేమిటి ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: ‘రాజధానిలో మా రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారంటారు. కానీ మమ్మల్ని కలవనీయరు. మంత్రి నారాయణ అసలు పట్టించుకోవడం లేదు. సీఆర్డీఏ అధికారులు రాజధాని రైతులను చిన్నచూపు చూస్తున్నారు..’ ఇదీ రాజధాని రైతుల ఐక్య కార్యాచరణసమితి (ఐకాస) నాయకుల ఆవేదన.
ఎన్నికలకు ముందు రాజధాని రైతులకు పెద్దపీట వేస్తామని, రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఎన్నికల తర్వాత ఐకాస నేతల్ని పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట గుంటూరులో అమరావతి ఐకాస నేతలు సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ధి విషయంలో నాడు చంద్రబాబు, ఇతర నేతలు చెప్పింది ఒకటైతే.. అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటని మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తరువాత మంత్రి నారాయణను ఆగస్టు 5వ తేదీన కలిసి 14 సమస్యల గురించి తెలిపినా స్పందన లేదని చెప్పారు. మళ్లీ కలుద్దామన్నా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలు వినేందుకు కూడా ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదని తెలిపారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తాము కలవడానికి, సమస్యలు చెప్పడానికి సీఆర్డీఏ అధికారులు అవకాశమే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో.. రైతుల సమస్యలు పరిష్కరించడం కూడా అంతే ప్రధానమని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెలాఖరున కార్యాచరణ ప్రకటిస్తామని, తదనుగుణంగా పోరాటం చేస్తామని రాజధాని రైతులు హెచ్చరించారు.
ఐకాస నేతలు అల్టిమేటం జారీచేయడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ దిగివచ్చాయి. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మంగళవారం హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఐకాస నేతలు తమ సమస్యలు వివరించారు. ఇకపై ఇలాంటి పొరబాటు జరగదని, నెలలో ప్రతి మూడో శనివారం ఐకాసతో సమావేశమై అన్ని విషయాలు చర్చిస్తామని కన్నబాబు హామీ ఇచ్చారు. అయితే దీనిపై ఐకాస నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రతి మూడో శనివారం కలిసి ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


