
తమ్ముళ్ల లూటీపై కౌన్సిల్‌లో గరం గరం
ఇంజినీరింగ్ సెక్షన్‌లో అవకతవకలపై ‘సాక్షి’ కథనంతో ప్రకంపనలు ఇవే అంశాలను ప్రస్తావించిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, కార్పొరేటర్ శ్రీరామ్ ప్రసాద్ ఒకే కాంట్రాక్టర్‌కు పదుల సంఖ్యలో వర్కుల కేటాయింపుపై నిలదీత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై ఈ నెల 22వ తేదీన ‘రూ.కోట్లలో తమ్ముళ్ల లూటీ!’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనం కౌన్సిల్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఈ అంశంపై తెలుగుదేశం సభ్యులే మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఈ అంశాలను చర్చకు తీసుకువచ్చారు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లపైనే పశ్చిమ ఎమ్మెల్యే, కార్పొరేటర్ విరుచుకుపడటంపై చర్చనీయాంశంగా మారింది.
అడ్డగోలుగా కేటాయిస్తారా?
నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి? ఒకరికే పదుల సంఖ్యలో టెండర్లు ఏ విధంగా కేటాయిస్తున్నారు? వంటి వాటిపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. అర్హత లేని కాంట్రాక్టర్లకు వర్కులు కేటాయించడం ద్వారా పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. గత సంవత్సర కాలంలో రూ.వందల కోట్లు పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయినప్పటికీ పనులు చేయని కాంట్రాక్టర్లకే టెండర్లు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ కాంట్రాక్టర్‌కు ఎన్ని వర్కులు కేటాయించారు? ఏ స్టేజ్‌లో ఉన్నాయి? వంటి వివరాలు తనకు అందజేయాలన్నారు.
నాణ్యతకు తిలోదకాలిస్తే ఎలా?
టెండర్ ప్రక్రియలో 30 నుంచి 40 శాతం వరకు కొందరు లెస్సులు వేస్తున్నారని, అదీ జీఎస్టీతో కలిపి ఇలా వేయడం ద్వారా నాణ్యత ఏముంటుందని టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ అధికారులను ప్రశ్నించారు. అర్హత లేని వారికి టెండర్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. టెండర్ రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన వారు కూడా పాల్గొంటూ వర్కులు చేసుకుంటూ బిల్లులు కూడా ప్రాసెస్ చేసుకున్నారని ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా కీర్తి చేకూరి ఉన్నప్పుడు ఇంజినీరింగ్ సెక్షన్‌లో అవకతవకలకు పాల్పడే టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించారని గుర్తుచేశారు. తిరిగి వారికి అక్కడే ఏ విధంగా విధులు కేటాయిస్తారంటూ నిలదీశారు. స్పందించిన ఇన్‌చార్జి ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి మాట్లాడుతూ... వర్కులు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన వారి 72 వర్కులను క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ సెక్షన్‌లో టెక్నికల్ అసిస్టెంట్ల స్థానంలో వార్డు ఎమినిటీ సెక్రటరీలను విధుల్లోకి తీసుకున్నామన్నారు. మొత్తానికి ‘సాక్షి’ కథనం కౌన్సిల్‌లో ప్రకంపనలు సృష్టించింది.