
డబ్బుకు కక్కుర్తిపడి షిఫ్ట్ ఆపరేటర్ల తొలగింపు
సత్తెనపల్లి: డబ్బుకు కక్కుర్తిపడి విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న నలుగురిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ నెల 21 నుంచి మౌఖిక ఆదేశాలతో తొలగించడంతో వారు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలిపింది. మాజీ మంత్రి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాను సత్తెనపల్లి శాసనసభ్యుడిగా, మంత్రిగా కొనసాగిన సమయంలో 34 మంది షిఫ్ట్ ఆపరేటర్లను నియమించినట్లు తెలిపారు. తెలుగుదేశం శాసనసభ్యుడు నియమించిన ఏ ఒక్క షిప్ట్ ఆపరేటర్‌ను తొలగించలేదన్నారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తే వాళ్లను తీసుకువచ్చి కొత్తగా ఇక్కడ వేస్తారన్నారు. 19 మందిని తొలగించారని, అంటే ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు చొప్పున రూ.95 లక్షలు బేరం పెట్టుకున్నారని, స్థానిక శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను ఈ మొత్తం తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ చిరు ఉద్యోగుల పొట్ట కొట్టవద్దన్నారు. 2023లో నియమితులైన నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించడం, కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు కళ్లం విజయభాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్ లక్కిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బాధితుల బంధువులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు