
గుండెపోటుతో తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ మృతి
తాడికొండ: గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్‌ఐ మృతి చెందిన ఘటన తుళ్ళూరులో జరిగింది. తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న రవీంద్ర (55) విధులు ముగించుకొని కారు నడపుతూ వెళుతుండగా తుళ్ళూరు శివారు సాయిబాబా ఆలయం వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యారు. కారును రోడ్డుపైనే నిలిపి పక్కకు పడిపోయారు. ఉన్నట్టుండి కారు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న ఏపీఎస్‌పీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టి రవీంద్రను బయటకు తీసి తుళ్ళూరు పీహెచ్‌సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి తుళ్ళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవ వధువు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్‌లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్‌కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
డీ ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకారవేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుము రూ.400తో కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 92471 20305, 98480 38769 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

గుండెపోటుతో తుళ్ళూరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ మృతి