
అంధత్వాన్ని జయించడం అద్భుతం
– రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో జయించి క్రికెటర్లుగా రాణిస్తున్న యువత ప్రతిభ అద్భుతమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అభినందించారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్‌లైండ్ ఏపీ, విజువల్లీ బ్‌లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంధులు సమాజంలో ఎవరికీ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారన్నారు. వీరిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ బ్‌లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన 42 క్రికెటర్లతో మూడు జట్లుగా మూడు రోజులపాటు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వీరి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్‌లైండ్ క్రికెట్ జట్టు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం జస్టిస్ కృష్ణమోహన్‌ను అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంంలో ఏపీ విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ పి.ప్రకాష్ రెడ్డి, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, వీసీఏ అధ్యక్షుడు రవీంద్రబాబు, అంధుల క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఇన్‌చార్జి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.