రైతులకు కడగండ్లు
వాగులు, పంట కాల్వల నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, గుంటూరు: సాగునీటి వ్యవస్థ నిర్వహణపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వాగులు, పంట కాల్వల నిర్వహణ పట్టించుకోక పోవడంతో ఏటా పొంగి పొలాలను ముంచెత్తుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 30,31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాల నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకపోవడంతో మరోసారి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో కష్టాల కడగండ్ల బారిన పడ్డారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గుంటూరు చానల్ (కొత్త కాలువ) కట్టకు నంబూరు శివార్లలోనూ, పెదకాకాని శివారు గోళ్లమూడి రోడ్డులోనూ గండి పడింది. పైర్లు నీట మునిగి రైతులు నష్టపోయారు. గత ఏడాది కాలువ కట్ల గండ్లను మొక్కుబడిగా పూడ్చిన అధికారులు.. ఈ ఏడాది ముందుస్తు జాగ్రత్తగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేదు. తాడేపల్లి మండలంలోని సీతానగరం నుంచి వట్టిచెరుకూరు మండలం గారపాడు వరకూ 47 కిలోమీటర్ల విస్తరించిన గుంటూరు చానల్ విస్తరణ, బలోపేతం చేసే పనులను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా పనులు ప్రారంభించలేదు.
తూటికాడ తొలగింపు పేరుతో కాజ నుంచి బుడంపాడు వరకూ 17 కిలోమీటర్లు మేర గడ్డిమందు కొట్టి మొక్కుబడిగా తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ పనులకు గాను నీటి సంఘాల నాయకులు రు. 24 లక్షలను దిగమింగారు. గత మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుంటూరు చానల్‌కు పెద్ద మొత్తంలో నీరు చేరి, ఉధృతంగా ప్రవహించింది. ఈ నీటి ప్రవాహానికి కాలువలో ఉన్న తూటికాడ తూములకు అడ్డుపడి చానల్ పొంగి పొర్లింది.
పెదకాకాని నుంచి గోళ్లమూడి వెళ్లే రోడ్డులోనూ, చినకాకాని వద్ద కాలువకు గండ్లు పడటంతో నీరు పొలాల్లోకి చేరి తటాకాలను తలపించాయి. కాలువ పొడవునా కట్ట ఎత్తు తక్కువగా ఉన్న పొలాల్లో నీరు చేరింది. దీంతో వరి మొలకదశలో ఉన్న పొలాలు నీటిలో పూర్తిగా మునిగి చెరువుల్లా మారాయి. వర్షాకాలంలో గండ్లు పడతాయని పదే పదే రైతులు మొర పెట్టుకున్నా అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులుగానీ స్పందించలేదు. దీంతో ఒక్క పెదకాకాని మండలంలోనే 10 వేల ఎకరాలు నీట మునిగినట్లు అధికారికంగానే వ్యవసాయ అధికారులు ప్రకటించారు.
డ్రైనేజీ కాల్వలకు కూడా గండ్లు
గత ఏడాది ఆగస్టు ఆఖరి వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో పంట కాల్వలను సకాలంలో ఆపకపోవడం, అత్యధిక వర్షపాతం కారణంగా పొంగి పొర్లాయి. గుంటూరు చానల్, హైలెవల్ చానల్, అప్పాపురం చానల్, కృష్ణా వెస్ట్రన్ కెనాల్‌తో పాటు డ్రైనేజీ కాల్వలకు కూడా గండ్లు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా మేజర్, మైనర్ గండ్లు సుమారు 237 పడ్డాయని అధికారులు చెబుతున్నారంటే ముంపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. అప్పుడు కూడా 74 వేల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురికాగా మరో 30 వేల ఎకరాల్లో ఉద్యాన, మిగిలిన పంటలు దెబ్బతిన్నాయి. వరద ముంపులో పంటలు ఆరు రోజుల వరకు పూర్తిగా మునిగిపోయాయి. దీన్నుంచి కూడా జిల్లా యంత్రాంగం ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. దీంతో మళ్లీ ఈ ఏడాది 72 వేల ఎకరాల్లో పంట ముంపునకు గురయ్యే పరిస్థితి తలెత్తింది. వరి సాగుకు ఇప్పటికే ఎకరానికి పది వేల రూపాయల వరకూ పెటుబడులు పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది.
కూటమి ప్రభుత్వ నిర్లిప్తతతో
వాగులు, పంట కాల్వల నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం
● భారీ వర్షానికి గుంటూరు
చానల్‌కు గండి
● నీట మునిగిన 10 వేల ఎకరాల
పంట పొలాలు
● గత ఏడాది కూడా మూడు చోట్ల గండి
● కూటమి ప్రభుత్వ వైఫల్యం..
రైతులకు శాపం
● డ్రైనేజీ వ్యవస్థ కూడా
అంతంత మాత్రమే..
● భారీ వర్షం వస్తే టోల్‌గేట్
వద్ద జాతీయ రహదారి మునక
● ఏడాదిలో రెండుసార్లు మునిగినా
పట్టించుకోని అధికార యంత్రాంగం
కాలువ కట్టల బలోపేతంపై నిర్లక్ష్యం
మొక్కుబడిగా తూటికాడ తొలగింపు
తటాకాలను తలపిస్తున్న చెరువులు