
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్‌ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి.
ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.
హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పషం చేశారు.