తుమ్మలపాలెం భేష్ !
ప్రత్తిపాడు: మండలంలోని తుమ్మలపాలెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఆ గ్రామ సర్పంచ్‌కు అవకాశం లభించింది. తాగు నీరు, పారిశుధ్యం, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ), జలశక్తి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో నిర్వహించిన హర్ ఘర్ జల్, ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరచడంతో అవార్డుకు ఎంపిక చేశారు. దేశ రాజధానిలో గ్రామ సర్పంచ్ చల్లా నాగమల్లేశ్వరి శుక్రవారం అవార్డును అందుకోనున్నారు. ఏపీ నుంచి మూడు జిల్లాల సర్పంచులు అవార్డును అందుకోనుండగా, అందులో గుంటూరు జిల్లా ఒకటి.
జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తుమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని కొండజాగర్లమూడి గ్రామాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. హర్ ఘర్ జల్ కింద తాగునీటి ట్యాంకు నిర్మించి, పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 178 ఇళ్లకు కుళాయిల ద్వారా శుద్ధి చేసిన సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గ్రామానికి హర్ ఘర్ జల్ సర్టిఫికెట్‌ను గతంలో అందించారు. ఈ నేపథ్యంలో అవార్డుకు ఎంపికై ంది.
గ్రామంలో 928 కుటుంబాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,618 మంది (ప్రస్తుతం 5–6 వేలు) నివసిస్తున్నారు. ఓడీఎఫ్ ప్లస్ గ్రామంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలు మినహా ఉన్న ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంది. బహిరంగ మలవిసర్జన నిషేధించారు. ప్రతి ఇంటికీ డస్ట్ బిన్‌లను అందించారు. తడి, పొడి చెత్త సేకరణతో పాటు ఎస్‌డబ్ల్యూపీసీ నిర్వహణ కూడా భేషుగ్గా ఉంది. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ బాగుండటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో అవార్డు దక్కింది.
ఇప్పటికే తుమ్మలపాలెంను జిల్లా పంచాయతీ అధికారులు మోడల్ గ్రామంగా ఎంపిక చేశారు. గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీని సుప్రీం ఎల్‌టీసీగా ఎంపిక చేసి, జిల్లాలోని ఆయా మండలాలకు చెత్త నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు.
● అత్యుత్తమ పనితీరు కనబరిచిన
ఓడీఎఫ్ ప్లస్ గ్రామం
● హర్ ఘర్ జల్ సర్టిఫికెట్
పొందిన గ్రామంగా గుర్తింపు
● ఢిల్లీలో జరిగే వేడుకల్లో
పాల్గొనాలని సర్పంచ్‌కు ఆహ్వానం
178 ఇళ్లకు కుళాయిలు
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి
మోడల్ గ్రామంగా ఎంపిక