కెపా‘సిటీ’కి మించి ఇసుక రవాణా
తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు.
ఇసుక రవాణాతో అవస్థలు
ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్‌తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.
భారీ వాహనాల్లో తరలింపు
పట్టించుకోని అధికారులు


