
ఏఎన్‌యూ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ), పరిసరాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. అదనపు బలగాలతో పహారా కొనసాగుతోందని వెల్లడించారు. కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు పెట్రోల్, డీజిల్‌ను బాటిళ్లలో విక్రయించరాదని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాణసంచా నిల్వ చేసే కేంద్రాల్లోనూ పోలీస్, అగ్నిమాపక శాఖ సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్, సెక్షన్ 144, 30 పోలీస్ చట్టం అమల్లో ఉందని స్పష్టం చేశారు. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువ మంది ఉండొద్దని చెప్పారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటం, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం/వదంతులు ప్రచారం చేయడం చట్ట రీత్యా నేరమని, రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత బైకులకు సైలెన్సర్లను తొలగించి, ఎక్కువ శబ్దంతో నడిపినా కేసులు తప్పవని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్ ఎన్నికల కోడ్, 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు ఎస్పీ తుషార్ డూడీ స్పష్టీకరణ