కొనసాగుతున్న 144 సెక్షన్‌ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న 144 సెక్షన్‌

Published Fri, May 17 2024 10:00 AM

కొనసాగుతున్న 144 సెక్షన్‌

పిడుగురాళ్ల: సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ 144 సెక్షన్‌ విధించింది. గురువారం కూడా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ బోసిపోయాయి. అత్యవసరమైతేనే ప్రజలు కూడా ప్రయాణాలు కొనసాగించారు. మొత్తం మీద 144 సెక్షన్‌ కారణంగా వాతావరణం ప్రశాంతంగా మారింది.

గురజాల: గురజాల పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్‌ అధికారులు తగు చర్యలు చేపట్టారు. గ్రామ పురవీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు 144 సెక్షన్‌ కారణంగా ఖాళీగా కనిపించాయి. దుకాణాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. సీఐ టి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు 144 సెక్షన్‌ అమలు జరిగేలా చర్యలు చేపట్టారు.

అమరావతి: అమరావతిలో గురువారం కూడా దుకాణాలను మూయించి మెయిన్‌ బజార్‌లో పోలీసు పహారా కాస్తున్నారు. సీఐ ఏవీ బ్రహ్మం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు.

నరసరావుపేటటౌన్‌: పట్టణంలో 144 సెక్షన్‌ గురువారం కొనసాగింది. 144 సెక్షన్‌ కారణంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లోని దుకాణాలు మూసివేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూశారు. సినిమా థియేటర్‌లలో ప్రదర్శనలు నిలిపివేశారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ మరో రెండురోజులు 144 సెక్షన్‌ అమల్లో నే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుకాణాలకు సమయపాలన విధించి నిర్వహించుకునేలా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం భావిస్తుంది.

సత్తెనపల్లి: పట్టణంలో చేపట్టిన 144 సెక్షన్‌ రెండవ రోజు గురువారం కూడా కొనసాగింది. పట్టణంలో పలు దుకా ణాలను మూసివేశారు.144 సెక్షన్‌ నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరగడం, నలుగురు కంటే మించి గుంపులుగా ఉన్న వారికి పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. 144 సెక్షన్‌ నిబంధనలు అతిక్రమించిన 35 మందిపై గురువారం కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన 18 మందిపై పట్టణ ఎస్‌ఐ ఎం సంధ్యారాణి, 17 మందిపై పట్టణ ఎస్‌ఐ ఎం సత్యనారాయణ కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెంటచింతల: రెంటచింతల మండలంలో గురువారం కూడా 144సెక్షన్‌ కొనసాగింది. దుకాణాలు, హోటల్స్‌ ఇతర వ్యాపార సంస్థలను పోలీసులు మూయించారు. ఎన్నికల రోజున ఘర్షణ జరిగిన రెంటచింతల, రెంటాల, పాలవాయి గేటు, తుమృకోట, గోలి, జెట్టిపాలెం గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. పాలవాయి గేటు, తుమృకోట, జెట్టిపాలెం గ్రామాలలో ఈవీఎంలు పగలగొట్టిన కేసులోని నిందితులకు ఘర్షణలకు పాల్పడిన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరికీ 41(ఎ) నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు నేతలు గ్రామాలు విడిచి రహస్య ప్రాంతాలకు తరలిపోయారు.

తెరుచుకొని దుకాణాలు ఇళ్లకే పరిమితమైన ప్రజలు

Advertisement
 
Advertisement
 
Advertisement