ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు.. | - | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..

Aug 24 2023 1:50 AM | Updated on Aug 24 2023 11:47 AM

తల్లిదండ్రులు దశరధరామిరెడ్డి, నాగమణితోఅక్కాచెల్లెళ్లు తిరుమల ప్రశాంతి, స్రవంతిరెడ్డి - Sakshi

తల్లిదండ్రులు దశరధరామిరెడ్డి, నాగమణితోఅక్కాచెల్లెళ్లు తిరుమల ప్రశాంతి, స్రవంతిరెడ్డి

తెనాలి: ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. పెద్దమ్మాయి సచివాలయంలో విమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్‌ సంరక్షణ కార్యదర్శిగా చేస్తుండగా, ఏపీపీఎస్‌సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షల్లో రెండో అమ్మాయి ఏకంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ స్టేట్‌ ట్యాక్స్‌ ఉద్యోగాన్ని సాధించింది. ప్రభుత్వం షెడ్యూలు ప్రకారం పారదర్శకతంగా నిర్వహించిన పరీక్షల కారణంగానే ఓపెన్‌ కేటగిరీలో తొలి ప్రయత్నంతోనే ఉద్యోగాలు వచ్చాయని ఆ కుటుంబం ఆనందపడుతోంది.

తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం
మారంరెడ్డి దశరధరామిరెడ్డి. తెనాలిలోని ఎన్‌ఆర్‌కే అండ్‌ కేఎస్‌ఆర్‌ గుప్త డిగ్రీ కాలేజీలో చరిత్ర అధ్యాపకులు. పక్కా కాంగ్రెస్‌వాది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుండదన్న భావనతో ‘కార్పొరేట్‌’ అవకాశాలను కాదనుకున్నారు. ఆయన భార్య నాగమణి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి తిరుమల ప్రశాంతి. రెండో కుమార్తె స్రవంతిరెడ్డి. బీటెక్‌ చేశాక తిరుమల ప్రశాంతికి వివాహం చేశారు. భర్త బ్యాంకు ఉద్యోగి. తానూ బ్యాంకు పరీక్షలు రాద్దామని అనుకుంటుండగా, 2019లో రాష్ట్ర ప్రభుత్వం వార్డు/గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. అదృష్టం పరీక్షించుకుందామని రాసిన తిరుమల ప్రశాంతికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం లభించింది.

స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా..
రెండోకుమార్తె స్రవంతిరెడ్డి. ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌ రాశారు. నాలుగు వేల ర్యాంకుతో బీడీఎస్‌లో సీటు లభించింది. వైద్యవృత్తి కన్నా రైతుసేవ మంచిదన్న భావనతో, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అనుబంధంగా గల బాపట్ల వ్యవసాయ కశాశాలలో అగ్రికల్చర్‌ బీఎస్సీలో చేరారు. 2019లో కాలేజీ, విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచారు. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌, నాటి యూనివర్సిటీ వీసీ చేతులమీదుగా మూడు బంగారు పతకాలను స్వీకరించారు. సివిల్స్‌ రాద్దామని కోచింగ్‌కు వెళ్లినా కరోనాతో సాధ్యం కాలేదు. తర్వాత సొంతంగా తయారై రెండుసార్లు సివిల్స్‌ రాసినా, ప్రిలిమ్స్‌ గట్టెక్కలేదు. గత సెప్టెంబరులో ప్రభుత్వం గ్రూప్‌–1 పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే అదీ ఓపెన్‌ కేటగిరీలో అసిస్టెంట్‌ కమిషనర్‌ స్టేట్‌ ట్యాక్స్‌ పోస్టు రావటంతో మురిసిపోతోంది స్రవంతిరెడ్డి.

ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లే..
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవటం, అందులోనూ ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా భర్తీ చేయటం గొప్ప విషయమని దశరధరామిరెడ్డి అంటారు. తాను కాంగ్రెస్‌కి వీరవిధేయుడినని చెబుతూ, మధ్యతరగతి కుటుంబీకుడినైన తన బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించటం కష్టమన్న భావన ఉండేదని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మెరిట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సకాలంలో పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల నియామకాలతో ఆ భావన తొలగిపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement