ఎరువుల నిల్వలు పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్)
కొరిటెపాడు(గుంటూరు): రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఖరీఫ్‌కు ముందు దుక్కులు సిద్ధం చేసుకోవడం.. విత్తనాలు సేకరించడం.. నీటి లభ్యతతో పాటు ఎరువులపై దృష్టి పెడతాడు. గతంలో సీజన్ ప్రారంభమైన అదను దాటిన ఎరువు దొరకక నానా అగచాట్లు పడిన పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో సకలం ఆర్బీకేల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే అవసరమైన ఎరువు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైనన్ని ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది. ఎరువుల సమస్య ఉత్పన్నం కాకుండా వ్యవసాయ, మార్క్‌ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వివిధ కంపెనీల ద్వారా వచ్చిన ఎరువులు మొదటి ప్రాధాన్యతగా రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగతావి హోల్‌సేల్, రిటైల్ డీలర్లతో పాటు వేర్ హౌస్‌లు, కంపెనీ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.
19,447 మెట్రిక్ టన్నులు...
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 19,447 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. అందులో యూరియా 8,485 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 7,323 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,450 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్(ఎస్‌ఎస్‌పీ) 839 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ) 280 మెట్రిక్ టన్నులు, కాంపోస్ట్ ఎరువులు 70 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ మాసం చివరి నాటికి మరో 20 వేల మెట్రిక్ టన్నులు, మే నెలలో మరో 20 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
19,447 టన్నులు రెడీ ఆర్‌బీకేలు, సొసైటీలకు మొదటి ప్రాధాన్యం ఖరీఫ్‌కు ముందస్తుగా అన్ని రకాల ఎరువులు సరఫరా ఖరీఫ్‌కు 1.35 లక్షల టన్నులు అవసరం
ప్రణాళిక ప్రకారం ఎరువులు
జిల్లాలో వరి, పత్తి, మిరప, పసుపు, పల్సస్(మినుము, శనగ, పెసర తదితర) పంటల విస్తీర్ణం, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని తగినంత సరఫరా, నిల్వలు ఉంచాం. జూన్ మాసం రెండో వారం నుంచి ప్రారంభం కానున్న 2023–24 ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 1.35 లక్షల టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు చేశాం. అనుమతులు రాగానే నెలవారీ కోటా మేరకు వివిధ కంపెనీల నుంచి అన్ని రకాల ఎరువులు సరఫరా అయ్యేలా చూస్తాం. రైతులకు గ్రామాల్లోనే ఎరువులు లభించేలా ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
–నున్నవెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


