27 నుంచి కేవీపీఎస్‌ శిక్షణ తరగతులు | Sakshi
Sakshi News home page

27 నుంచి కేవీపీఎస్‌ శిక్షణ తరగతులు

Published Mon, Mar 20 2023 1:52 AM

-

సత్తెనపల్లి: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర శిక్షణ తరగతులు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంజిమాల రవిబాబు తెలిపారు. పట్టణంలోని పుతుంబాక భవన్‌లో కేవీపీఎస్‌ పల్నాడు జిల్లా కమిటీ సమావేశం చింతపల్లి నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. రవిబాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లా అమరావతిలో నిర్వహించనున్న తరగతులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చిన హక్కులను, చట్టాలను లేకుండా చేస్తున్న నేపథ్యంలో ఈ మనుధర్మ శాస్త్ర, రాజ్యాంగ వ్యతిరేక భావజాలాన్ని తిప్పి కొట్టడానికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో కేవీపీఎస్‌ నాయకులు బొల్లెపల్లి రామారావు, నందిగం వీరబాబు, మాధవరావు, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వినుకొండలో భారీ చోరీ

వినుకొండ(నూజెండ్ల): పట్టణంలో భారీ దొంగతనానికి పాల్పడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని పాత మార్కెట్‌ సమీపంలో గర్రెవారి వీధికి చెందిన వ్యాపారి కోట రామాంజనేయులు నివసం ఉంటున్నాడు. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. తాళం పగులకొట్టి ఇంట్లోని కీబోర్డులో ఉన్న రూ.15లక్షల నగదు, 20 సవర్ల బంగారం ఆభరణాలు దోచుకెళ్లారు. శుభాకార్యానికి వెళ్లి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు ఆదివారం గుర్తించారు. బాధితులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్‌లో నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement