YS Rajasekhara Reddy Death Anniversary: మరో రూపంలో మహానేత

Ysrcp Ambati Rambabu Guest Column On Ys Rajasekhara Reddy Death Anniversary - Sakshi

మహానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. అందుకు మంచి ఉదాహరణ దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలకు దగ్గరై వారి అభ్యున్నతికి కృషి చేస్తూ అనుకోకుండా అసువులు బాసిన నేత. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జల యజ్ఞం... ఈ పథకాల్లో కొన్నింటిని ఆయనే రూపొందించి అందిస్తే, మరికొన్నింటిని అమలు చేయడం ఎలాగో చూపించారు. రాజకీయ ప్రత్యర్థులు ఎక్కుపెట్టిన దుష్ప్రచారాన్ని చిరునవ్వుతో ఎదుర్కొని, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా వారికి పుట్టగతులు లేకుండా చేశారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ఆయన కుటుంబంపై వ్యాపింపచేసిన అబద్ధాలూ, చేసిన ఆరోపణలూ, పెట్టిన ఇబ్బందులూ... అన్నింటినీ ప్రజలు గమనించారు. అందుకే ఆయన కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని గెలిపించారు. ఆ విధంగా రాజన్న రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించారు.

ఎన్నో జ్ఞాపకాల భాండాగారం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. దగ్గరగా ఉన్న నాబోటి వ్యక్తులకే కాక, ఏనాడూ ఆయన్ను ప్రత్యక్షంగా చూడని.. కలవని కోట్ల మందికి కూడా వైఎస్సార్‌ ఆత్మీయుడు, ఆరాధ్యుడు, మనసుకు దగ్గరి మనిషి! అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణించి, నేటికి 13 ఏళ్ళు పూర్తవుతోంది. ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం చెక్కుచెదర లేదు.

ఇన్నేళ్ల తరవాత కూడా, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో, కోట్ల కొద్దీ తెలుగు హృదయాల్లో అలాగే ఉండిపోయారు. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జల యజ్ఞం... ఈ పథకాల్లో కొన్నింటిని ఆయనే రూపొందించి అందిస్తే, మరి కొన్నింటిని అమలు చేయటం ఎలాగో చూపించారు. రాష్ట్రాలు విడిపోయినా, ముఖ్యమంత్రులు, అధికార పార్టీలూ మారినా, గిట్టక ఈ పథకాల అమలును నీరుగార్చటానికి వారిలో కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... నీరుగార్చటానికి ప్రయత్నించినవారు నీరుగారి పోయారు తప్ప, ఆ పథకాలు చెక్కు చెదరలేదు. 

మహానేత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపా లించినది కేవలం అయిదేళ్ళ మూడు నెలలు. మిగతా కాలం అంతా, ఎవరు అధికారంలో ఉన్నా మహానేత మీద జరిగినదంతా దుష్ప్ర చారమే. సొంత పార్టీలో కొందరికీ; విపక్షానికీ, విపక్షాన్ని సమర్థించే మీడియాకూ... అందరికీ టార్గెట్‌ నంబర్‌–1 వైఎస్సార్‌. ఇంతమంది కడుపుమంటనూ ఓపికగా భరించాడు, చిరునవ్వుతోనే జయించాడు. అందరినీ ఎదురొడ్డి నిలిచాడు, గెలిచాడు! 

వైఎస్సార్‌ మరణానంతరం గడచిన 13 సంవత్సరాల్లో, వైఎస్‌ జగన్‌గారి మీద ఆ దాడి మరింత పెరిగింది. ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేని ప్రత్యర్థులు ఈ 13 సంవత్సరాలుగా ఎంచుకున్న మార్గం కూడా అదే. జగన్‌పై దుష్ప్రచారం. అక్రమ కేసుల బనాయింపు. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌! మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో వైఎస్సార్‌ ఎంతటి దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నారో, ఈ 13 ఏళ్లలో వైఎస్‌ జగన్‌ అంతకు మించిన దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నారు.

విద్వేషపూరిత యుద్ధం
ప్రజా క్షేత్రంలో, ప్రజా సమస్యల మీద పోరాడే సత్తాలేని వారంతా నాడు తండ్రి మీద... ఆ తరవాత తనయుడి మీద చేసినది రాజకీయ పోరాటం కాదు. వ్యక్తిగత ద్వేషాలతో యుద్ధం. ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీలను కూడా మచ్చిక చేసుకునే నైపుణ్యం ఉన్న చంద్రబాబుకు; ఎల్లో మీడియాకూ, దుష్ట చతుష్టయానికీ ఆ రోజుల్లో ఏనాడూ వైఎస్సార్‌ లొంగలేదు. ఆ తరవాత, రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు జగన్‌ ఏనాడూ రాజీపడలేదు. కాబట్టి ఆనాడూ ఈనాడూ ప్రత్యర్థులు ఒక్కరే. అక్కసుతో, అసూయతో, ద్వేషంతో చేసే దుష్ప్రచారాలు మాత్రం మరో నాలుగు రెట్లు పెరిగాయి.  

కాబట్టే, తండ్రిని మించిన తనయుడిగా వైఎస్‌ జగన్‌ ఈ ప్రచారాలకు తన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మరో నాలుగు అడుగులు ముందుకు వేసి సమాధానమిస్తున్నారు. దుష్ప్రచారాలు, అపోహలు, అసత్యాలు వైఎస్సార్‌కు అధికారం దక్కకుండా చాలా కాలమే ఆపాయిగానీ, శాశ్వతంగా అధికారం దక్కకుండా చేసే అంతటి శక్తి ఈ విష ప్రచారాలకు లేదు. ఒక్కసారి ప్రజలు అధికారం ఇచ్చిన తరవాత, ఆ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును చూశాక, వైఎస్సార్‌ మీద ఎన్నికల్లో విజయం సాధించి అధికారం తెచ్చుకోవటం ఇక ఏనాటికీ జరగని పని అని ప్రతిపక్షానికి బాగా అర్థమయింది. 

ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ విషయంలోనూ వారికి అదే అర్థమయింది. కేవలం 38 నెలల పాలనలో ఏకంగా రూ. 1.70 లక్షల కోట్లు డీబీటీగా అందించిన నాయకుడిని ఎదుర్కోవటానికి కావాల్సిన పాజిటివ్‌ సరంజామా నాలుగు దశాబ్దాల టీడీపీ తుప్పు సైకిల్‌కు లేదు. అలాగే దాన్ని తొక్కే శక్తి 73 ఏళ్ల చంద్రబాబుకూ లేదు. కాబట్టే సైకిల్‌ పెడల్స్‌ తొక్కే ‘అదృష్టాన్ని’ సొంత పుత్రుడికి కాకుండా దత్తపుత్రుడికీ, గత కాలపు మిత్ర పక్షానికీ అప్పగిస్తానని చంద్రబాబు అందరితోనూ కబుర్లు పంపుతున్నారు, బేరాలు ఆడుతున్నారు. 

అత్యున్నత న్యాయ నిర్ణేతలు ప్రజలే!
వైఎస్సార్‌ హఠాన్మరణం తరవాత,  ప్రజలంతా జగన్‌ మీద అమిత మైన అభిమానం చూపిస్తే తట్టుకోలేక...  వారి కుటుంబాన్ని రాజకీ యంగా, ఆర్థికంగా ఎంతగా టార్గెట్‌ చేశారో, దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యవస్థల్ని ఎలా ప్రయోగించి ఎంతగా ఇబ్బందు లపాలు చేశారో కూడా ఈ పదమూడేళ్ల చరిత్రలో అడుగడుగునా కనిపిస్తుంది! ఈ దుర్మార్గ చరిత్రలన్నింటికీ, ఈ వ్యవస్థల దుర్మార్గానికి ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఎలా బదులిస్తున్నారో కూడా ఈ 13 సంవత్సరాల చరిత్రే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 

వైఎస్సార్, వైఎస్‌ జగన్‌... ఇద్దరూ ముఖ్యమంత్రులు. నాడు తండ్రి... నేడు తనయుడు! వైఎస్సార్‌ చరితార్థుడు. ఆయన కొడుకు, ఆయన అంచనాలకు మించి, తనకు తానుగా ఎదిగాడు! వైఎస్సార్‌ కంటే ఎక్కువగా శత్రువులను ఎదుర్కొని రాటుతేలి మరీ ఎదిగాడు! 44 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఒక్కడిగా ప్రజల్లోకి వెళ్ళటానికి ధైర్యం చాలనంతగా ప్రజలకు మంచి చేసి ఎదిగాడు. ప్రజలకు మంచి చేసే విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వానికీ తీసిపోనని ప్రజల మనిషిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరూ పిస్తుంటే...  ఏ తండ్రి అయినా ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది? 

మరోవంక, వైఎస్సార్‌ ప్రత్యర్థి పరిస్థితి చూడండి... నాడు 2004, 2009లో వైఎస్సార్‌ చేతిలో ఓడాడు, నేడు – వైఎస్‌ జగన్‌ చేతిలో కూడా మూడేళ్ళ క్రితం, 2019లో అంతకంటే దారుణంగా ఓడాడు. ప్రత్యర్థి, చివరికి తన కొడుకుని కూడా, అది కూడా అడ్డదారిలో మంత్రిగా నాలుగేళ్ళు కూర్చోబెట్టి కూడా... చిత్తుగా ఓడగొట్టుకున్నాడు. చంద్ర బాబు... బతికి ఉండీ ఎంతటి దురదృష్టవంతుడు! వైఎస్సార్‌... దివికి ఏగి కూడా ఎంతటి అదృష్ట వంతుడు! 

తన రెక్కల కష్టంతో...
మహానేత మరణం తరవాత సానుభూతి పవనాలతో గెలిచాడన్న అపప్రథ కూడా వైఎస్‌ జగన్‌కు లేదు. 2019లో 175కు 151 ఎమ్మెల్యేలను ఆయన రెక్కల కష్టంతో, ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. చివరికి చంద్ర బాబు కంచు కోట అయిన కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నిక లన్నింటిలో టీడీపీకి బీటలు వారేలా చేసినది ఏమిటంటే... ఇంటింటికీ, మనిషి మనిషికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయం కూడా చూడకుండా జగన్‌ చేసిన మంచి మాత్రమే. ప్రజల మధ్య, ప్రజల వాడిగా, ప్రజల తోడుగా... ఒంటి చేత్తో అధికారం తెచ్చుకున్న వైఎస్‌ జగన్‌ బాణీ విభిన్నమైనది! వైఎస్సార్‌ – వైఎస్‌ జగన్‌... ఇద్దరూ ఎవరి శైలిలో వారు ప్రజల ఛాంపియన్లు. 

వైఎస్సార్‌ – వైఎస్‌ జగన్‌ ఇద్దరికీ వారి రక్తంలోనే ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్న భావం బలంగా ఉంది. చేస్తున్నది మంచి అయినప్పుడు నిర్భయంగా అడుగు ముందుకు వేసే స్వభావం ఇద్దరిదీ. ప్రజల గుండె చప్పుడు స్వయంగా విన్న ప్రజా నాయకులు వీరిద్దరూ! ఒక్కో ప్రాంతంలో మనిషితోపాటు అక్కడి మట్టి, అక్కడి పేదరికం చెప్పే సంగతులు, సామాజిక వర్గాల ఆకాంక్షలు, అక్క చెల్లెమ్మల అంత రంగం, పిల్లల భవిష్యత్తు పట్ల విజన్‌ ఉన్న నాయకులు వీరిద్దరూ. తండ్రి మీద మమకారం ఆకాశమంత ఉన్నా, వినమ్రంగా 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం వంటి పథకాలకు మరింతగా మెరుగులు దిద్ది కొనసాగించటమే కాకుండా... నేడు ప్రజల ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత వంటి నవరత్నాల పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ధీశాలి, మనసున్న మనిషి... పేద వర్గాల పెన్నిధి వైఎస్‌ జగన్‌.

రోల్‌ మోడల్‌
మట్టి నుంచి పుట్టిన మొక్కకి... చెట్టు మీద పెరిగే పరాన్నజీవికి ఎంత తేడా ఉంటుందో జనం నుంచి పుట్టిన నాయకుడిని, అధికారం లాక్కున్న నాయకుడికి మధ్య కూడా అంతే భేదం ఉంటుంది.  దళిత, బీసీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, రైతు వర్గాలకు న్యాయం చేసే విషయంలో గట్టిగా అడుగులు పడకపోతే... తరాలు మారినా తల రాతలు మారవని గట్టిగా నమ్మి తన ఆచరణను నిర్ణయించుకున్న దార్శనికుడు జగన్‌. పరిపాలనలో భారతదేశంలోనే ఒక రోల్‌ మోడల్‌ ఆయన. 13 సంవత్సరాల క్రితం దివికి ఏగిన తండ్రి, నేడు భువి మీద తన తనయుడు  పాలన చూసి కచ్చితంగా గర్విస్తాడు.

అంబటి రాంబాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top