రాకేశ్, లోకేశ్‌ – ఆంధ్రప్రదేశ్‌!

Vardelli Murali Article On TDP Politics In Andhra Pradesh - Sakshi

జనతంత్రం 

‘ది హేగ్‌’ నగరంలోని ప్రాచీన టౌన్‌హాల్‌లో వున్న మధ్య యుగాల నాటి ప్రసిద్ధ పెయింటింగ్‌ ఒకటి మొన్న టపీమని పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ పెయింటింగ్‌ కింద  'Audi alteram partem' అనే లాటిన్‌ వాక్యం రాసి ఉంటుంది. ‘అవతలిపక్క వాణిని కూడా వినాలి’ అని ఆ వాక్యానికి అర్థం. ఈ వాక్యాన్ని సహజ న్యాయపు ప్రథమ సూత్రంగా ప్రపంచం లోని ప్రముఖ న్యాయ వ్యవస్థలన్నీ పరిగణిస్తాయి. భారత రాజ్యాంగం కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్‌ 14 నుంచి 21 వరకు సహజ న్యాయానికి పట్టం కట్టే అంశాలను చేర్చుకున్నది. కింది కోర్టుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు ఈ సూత్రాన్ని గౌరవిస్తూనే వస్తున్నాయి.

పదవీ విరమణకు సరిగ్గా ఒక్కరోజు ముందు గౌరవరిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఏపీ హైకోర్టులో సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా, విరుద్ధంగా కొత్తపుంతలు తొక్కారు. సహజ న్యాయసూత్రాల మార్గాన్ని వదిలేయడమే కాదు. మనబోటి సామాన్యులకుండే కామన్‌సెన్స్‌ లాజిక్‌ కూడా ఈ సందర్భంలో పట్టాలు తప్పింది. కొద్దిరోజుల క్రితం ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ కార్యక్రమంపై పలు పిటిషన్లు పడ్డాయి. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నాయకత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆ కేసుపై విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ఒక సందర్భంలో జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఈ రాష్ట్రం దివాళా తీసిందా? అని ప్రశ్నించారు.

ఇక్కడ రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు లేదని వ్యాఖ్యా నించారు. దీనికి కొద్దిరోజులముందు తెలుగుదేశంవారు దాఖలు చేసిన పిటిషన్‌లతోపాటు మరికొన్ని హెబియస్‌ కార్పస్‌ పిటిష న్‌లను విచారిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగం బ్రేక్‌ డౌన్‌ అయిందని తేల్చేస్తానని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఈ ఉత్తర్వు లపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విస్మయాన్ని, ఆందోళననూ వ్యక్తం చేస్తూ వాటిపై స్టే ఇచ్చింది. మిషన్‌ ఏపీ బిల్డ్‌ కేసుపై తన రిటైర్‌మెంట్‌కు ఒక్కరోజు ముందు తీర్పును ఇస్తూ కేసు పరిధిలో లేని అనేక అంశాలపై ఆయన యథేచ్ఛగా వ్యాఖ్యానాలు చేయడం జ్యుడీషియల్‌ వర్గాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది.

మిషన్‌ ఏపీ బిల్డ్‌ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ కాదు. అటువంటప్పుడు ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలను పరుష పదజాలంతో చేయడం ద్వారా న్యాయమూర్తి లక్ష్మణరేఖను దాటినట్టు కాదా? వ్యక్తిగత గౌరవాన్ని గాయపరచడం కాదా? సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? ముఖ్యమంత్రిపై ఉన్న పెండింగ్‌ కేసుల గురించి ఈ కేసులో సదరు పిటిషనర్‌ ప్రశ్నించారా? లేదే! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్య మంత్రి లేఖ రాయడం తప్పా... ఒప్పా అని సదరు పిటిషనర్‌ న్యాయస్థానం అభిప్రాయాన్ని అడిగారా? లేదే! విచారణ పరి ధిలో లేని అంశంపై గౌరవ ముఖ్యమంత్రి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసేముందు ఆయన వాణిని విన్నారా? లేదుగాక లేదు. ఇది సహజ న్యాయసూత్రానికి వ్యతిరేకం కాదా? అంత ర్జాతీయ న్యాయస్థానాలకు నెలవైన ‘ది హేగ్‌’ నగరంలోని 'Audi alteram partem' పటం  పగలకుండా ఉంటుందా?

ఏపీ ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు ఎందుకు పెట్టారో... ఎవరు పెట్టారో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు. పిటిషన్‌లో ఏముందో కూడా ఆ కేసు పిటిషనర్, కాంగ్రెస్‌ నేత శంకర్రావుకు తెలియదు. ఈ సంగతి ఆయనే స్వయంగా వెల్లడిం చారు. హైకమాండ్‌ సంతకం పెట్టమంటే పెట్టానని ఆయన చెప్పారు. పిటిషన్‌లలోని అభియోగాలపై సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయమూర్తికి ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే కేంద్రం ఆదేశాలతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవప్రదమైన మరో పదవిని ఏర్పాటు చేసింది. సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై ఈ కేసులో ఎన్ని మ్యానిపులేషన్లకు పాల్పడ్డారో కూడా ప్రజలం దరూ చూశారు. ఆ కేసులపై విచారణ జరుగుతున్నది. న్యాయ శాస్త్ర సూత్రాల ప్రకారం అభియోగాలు నిరూపితమయ్యేంత వరకు ఎవరూ తప్పుచేసినట్టు కాదు. రేపు కేసులు వీగిపోయి నిర్దోషిగా తేలితే, చేసిన కామెంట్లను ఎలా వెనక్కు తీసుకో గలుగుతారు? న్యాయమూర్తికీ నిగ్రహం ఉండాలి కదా!

గౌరవ న్యాయమూర్తి తన తీర్పులో పొందుపరచడానికి గూగుల్‌ను ఎంచుకున్న తీరుపై కూడా న్యాయనిపుణులు ఆశ్చ ర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల గురించి గూగుల్‌ ద్వారా తెలుసుకున్నానని గౌరవ న్యాయమూర్తి చెప్పారు. ఓపిగ్గా సెర్చి చేస్తే గూగుల్‌లో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఆరోజుల్లో పప్పు అని టైప్‌ చేస్తే ఏ ఫిగర్‌ను గూగుల్‌ చూపెట్టేదో తెలియనిదెవరికి? గూగుల్‌ చెప్పింది కనుక ఆ ఫిగర్‌ నిజంగానే పప్పవుతుందా? ఫోర్‌ట్వంటీ, వెన్నుపోటు అని కొడితే ఎవరు ప్రత్యక్షమయ్యేవారో మనకు తెలియదా? ఇంతెందుకు... జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఏపీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చిన సందర్భంలో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వారు గూగుల్‌లో శోధించే ఉంటారు కదా? ఆయన గురించి గూగుల్‌లో తెలిసే విషయాల్లో అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే ఆయన బిహార్‌ హైకోర్టు నుంచి బదిలీ అయిన సంగతి. ఈ న్యాయమూర్తి తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నాడని 11 మంది జడ్జీలు సభ్యులుగా ఉన్న విస్తృత ధర్మాసనం తప్పుపట్టింది. ఈ న్యాయమూర్తి వ్యవహార శైలిని ధర్మాసనం తీవ్రస్థాయిలో ఎండగట్టింది. న్యాయమూర్తికి కొంతకాలం ఏ పనీ అప్పగించకుండా ప్రధాన న్యాయమూర్తి దూరం పెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. 

మన సంస్కృతిలో న్యాయం, ధర్మం సాక్షాత్తు దైవంతో సమానం. అందువల్లనే న్యాయస్థానాలను ధర్మదేవతలుగా పరి గణిస్తాము. లిటిగెంటు వ్యూహాలతో, మ్యానిపులేషన్లతో దైవ సమానమైన న్యాయస్థానాలను కూడా బురిడీ కొట్టించి తనక్కా వలసిన ఫలితాలను పొందగలిగే కళను రూపొందించిన తొలి రాజకీయవేత్త చంద్రబాబు. ఎన్టీ రామారావు స్వార్జితాలైన తెలుగుదేశం పార్టీని, పతాకాన్ని, పార్టీ బ్యాంకు ఖాతాలను కోర్టు ద్వారా బాబు దక్కించుకోవడం ద్వారా ఈ కళ తొలి ప్రయోగం విజయవంతమైంది. అప్పటినుంచి ఆయన ఈ కళను దినదినా భివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రత్యర్థులపై ప్రజాకోర్టులో గెలవలే నప్పుడు కోర్ట్‌ ఆఫ్‌ లా మాటున దాక్కుని లిటిగెంట్‌ రాళ్లను విసరడం రివాజుగా మార్చుకున్నారు. ఇప్పుడాయన రాజకీ యాల నుంచి రిటైర్‌ కావాల్సిన దశకు చేరుకున్నారు. ఇక వారసు నికి వేట నేర్పాలి. ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా? ససేమిరా మేయదు. చేనుతో చెడుగుడు ఆడేయాల్సిందే. న్యాయ దేవత కళ్లకున్న గంతలను అవకాశంగా తీసుకుని ఆమె ముందే తండ్రి మాయాజూదం ఆడితే, కొడుకు సాక్షాత్తూ దేవుళ్లనే రాజకీ యాల్లోకి లాగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ వారాంతం స్పెషల్‌గా లోకేశ్‌బాబు ఓ సవాల్‌ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలు తప్పని తాను సింహాచలం పుణ్య క్షేత్రంలో ప్రమాణం చేస్తాననీ, అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి కూడా సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఒంటిచేత్తో యాభై శాతం ఓట్లను, 85 శాతం సీట్లను గెలిపించిన ముఖ్యమంత్రి ఎక్కడ? అధికారంలో ఉండి, కోట్లు గుమ్మరించి కూడా పోటీచేసిన సొంత స్థానంలో చతికిలపడ్డ లోకేశ్‌బాబు ఎక్కడ? ఇద్దరి మధ్యా ఈ సవాల్‌ ఏమిటి? అని ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే రాజకీ యాల్లో లోకేశ్‌బాబుకు తనదైన ఒక సొంత కామెడీ ట్రాక్‌ ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో తనకు ఆయన సొంత మామ తప్ప మరెవరూ సాటిరారు. కాకపోతే ఈ సవాల్‌ వల్ల ఒక రాజకీయ కుట్ర గుట్టు రట్టయింది.

గత రెండు వారా లుగా జిల్లాలవారీగా తెలుగుదేశం–వైసీపీ నేతల మధ్య ఇటు వంటి ప్రమాణాల సవాళ్ల పర్వం నడుస్తున్నది. ఈ పర్వాన్ని క్లైమాక్స్‌కు తీసుకునివెళ్లడానికి లోకేశ్‌బాబు తాపత్రయపడ్డారు. సవాళ్ల టైమింగ్‌ గమనించండి. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 7 వరకు రెండు వారాలపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు పట్టాలను అందజేస్తున్నది. అదీ మహిళల పేరు మీద. 30 లక్షల మందికి లబ్ది చేకూర్చబోతున్నారు. జనసంక్షేమ కార్యక్రమాల్లో కనీవినీ ఎరుగని విప్లవాత్మక ముందడుగు ఇది. ఈ కార్య క్రమానికి ప్రచారం దక్కరాదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహజంగానే కోరుకున్నది. ఇప్పుడు ఆ పార్టీకి వెలుగులు మింగే ఒక రాహువు కావలసి వచ్చింది. పున్నమి చంద్రుడిని కబళించే గ్రహణం కావలసి వచ్చింది. అదిగో ఆగ్రహణమే ఈ గుడి ప్రమాణాల జాతర. గుడి ప్రమాణాలు మేడిన్‌ టీడీపీ ఆఫీస్‌ అనే సంగతి లోకేశ్‌ సవాల్‌తో పూర్తిగా బోధపడింది. ఈ లోగుట్టు తెలి యని వైసీపీ నేతలు కూడా సవాళ్లలో ఇరుక్కుని తొడలు చరచ డంతో మీడియా అటెన్షన్‌ మొత్తం అటువైపు మళ్లింది. మహో త్కృష్టమైన మానవీయ కార్యక్రమానికి ప్రచారం కరువైంది.

కరోనా కాలం తండ్రీకొడుకులకు ఒకరకంగా బాగా కలిసొ చ్చింది. ఆరేడు నెలలపాటు ఎక్కడికీ వెళ్లలేదు. ‘జూమ్‌ బరాబర్‌’ అనుకుంటూ గడిపేశారు. ఈ కాలంలోనే మాకియవెలియన్‌ రాజకీయ వ్యూహంలో కొత్త వేరియంట్‌ పురుడుపోసుకుంది. ఈ వేరియంట్‌ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రాణావసరం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిన్నర పరిపాలన కాలంలో అడ్మిని స్ట్రేషన్‌ విషయంలో గానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లోగానీ వేలెత్తి చూపే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించగలిగే అవకాశం లేదు. తరుణోపాయం కావాలి. ఆ తరుణోపాయమే దేవుడు.

ఆ న్యాయదేవతను ఉపయోగించుకోవడం ద్వారా తండ్రి జమానా ప్రారంభమైనట్టే, దేవుడి సెంటిమెంట్‌తో కొడుకు రాజకీయ ఇన్నింగ్స్‌ ప్రారంభం కావాలని నిర్ణయం జరిగిపోయింది. గత కొంతకాలంగా అక్కడక్కడా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, దానిపై మీడియా గోరంతలు కొండంతలు చేయడం అంతా ఒక రాజకీయ వ్యూహంలో భాగమే. పథకం ప్రకారం, చీకటి ముసుగులో నిర్మానుష్య వేళల్లో దాడులు చేసే దొంగలను సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టవచ్చు. కుట్రదారులకు ఈ మాత్రం సమయం చాలు. ఈలో గానే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టవచ్చు. జనాన్ని ఆందోళనకు పురి కొల్పవచ్చు. అల్లర్లను రాజేయవచ్చు. శాంతిభద్రతలు సన్న గిల్లాయని మీడియాలో వీరంగం వేయవచ్చు.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినంత విధ్వంసం హిందూ దేవాలయాల్లో ఎన్నడూ జరగ లేదు. తాము రాజధానిగా ప్రకటించుకున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో నలభై గుళ్లను స్వయంగా ప్రభుత్వమే బుల్డో జర్లు పెట్టి కూల్చేసింది. కూల్చేసిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. దేవాలయ భూములను కబళించేం దుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. క్షుద్ర పూజలు చేయించి పెద్దపెద్ద దేవాలయాలను అపవిత్రం చేశారు. తిరుమల హుండీ సొమ్ముతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలు తమిళనా డులో దొరికాయి. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ ఆరోజుల్లో మీడియా కిమ్మన్నాస్తిగా ఉండిపోయింది.

ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో రెండు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగితే ఆ రెండూ తెలుగుదేశం కీలక నేతల కనుసన్నల్లోనివి కావడం గమనించవలసిన విషయం. డిసెంబర్‌ 28న శ్రీరాముని విగ్రహం ధ్వంసం అయిన రామతీర్థం ఆలయానికి చైర్మన్‌ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు. రాజమహేంద్రవరం శ్రీరాం నగర్‌లో వున్న వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖకు సంబంధంలేని చిన్న గుడి. అది గతంలో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గన్ని కృష్ణ అజమాయిషీలో వుండేది. అక్కడ డిసెంబర్‌ 31న సుబ్రహ్మ ణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం చేశారు. 

దేవుడి వ్యూహంతోపాటు మరో కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. వివిధ సామాజిక వర్గాల మధ్య ముఖ్యంగా, దళిత–గిరిజన–బీసీ వర్గాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్గాల ప్రజలు గుండు గుత్తగా వైసీపీకి ఓట్లు వేసే అవకాశాలున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ వర్గాల మధ్య ఘర్షణలు జరగాలి. ఇందుకోసం వారి మధ్యన ఉండే చిన్నచిన్న అపోహలు, విభేదాలు, పంచా యతీలపై ఆ పార్టీ అధ్యయనం చేస్తున్నది. అవకాశమున్న ప్రతి చోట ఘర్షణలను ప్రేరేపించి శాంతి–భద్రతల సమస్యను సృష్టిం చడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. శాంతి– భద్రతల సమస్య తలెత్తకుండా ఉండా లంటే తెలుగుదేశం పార్టీ కదలికలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం అవసరం.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top