రక్షణ ఒప్పందంపై అత్యుత్సాహం!

Vappala Balachandran Guest Column On India And America Defence Deal - Sakshi

విశ్లేషణ

ఫిలిప్పీన్స్‌ అనుభవంలోంచి చూస్తే, అమెరికా పాలనాయంత్రాంగం పరివర్తనా స్థితిలో ఉంటున్నప్పుడు భారత్, అమెరికాల మధ్య ఇటీవల రక్షణ ఒప్పందం ఖరారైన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మనసులో ఏముండేది అనేది ప్రాధాన్యత కలిగిన విషయం. రాబోయే ఎన్నికల్లో జో బైడెన్‌ గెల్చినట్లయితే చైనా పట్ల భారత్‌ వ్యతిరేకత ఎలా పరిణమిస్తుంది? ఇతర రంగాల్లో అమెరికా, చైనా సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒబామా విధానంపై మన వైఖరి ఏ రూపు తీసుకుంటుంది? పైగా మన రక్షణ రంగానికి అమెరికా సాంకేతిక మద్దతు ఇవ్వనప్పుడు ఈ ఒప్పందం నుంచి భారత్‌ పెద్దగా ఆశించేది ఏమీ ఉండదు.

ఈ అక్టోబర్‌ 27న భారత్‌–అమెరికాల మధ్య ప్రాదేశిక సహకారం కోసం కుదిరిన మౌలిక సదుపాయాల మార్పిడి సహకార ఒప్పందం (బెకా)పై మనం మరీ ఉబ్బితబ్బిబ్బవడానికి ముందు క్షేత్ర వాస్తవాలను గురించి ఆలోచించుకోవాల్సి ఉంది. మన రక్షణ వ్యవస్థలను మెరుగుపర్చడానికి అమెరికా సాంకేతిక సహకారం అందించడం అనేది కచ్చితంగా గొప్ప విజయం అనే చెప్పాలి. అయితే అంతకుమించి మనం దేన్ని ఆశించినా అది వాస్తవ విరుద్ధమే అవుతుంది.

మన టీవీ మీడియా ఇప్పటికే ఈ ఒప్పందంపై చాలా అతిగా స్పందించింది. కొన్ని ప్రసార సంస్థలయితే మరీ ముందుకెళ్లి, 1962 అక్టోబర్‌ 27న జనరల్‌ బీఎమ్‌ కౌల్‌ సిఫార్సు చేసిన యుఎస్‌ ఎయిర్‌ అంబ్రెల్లా (గగనతల రక్షణ ఛత్రం) వంటి భద్రతాపరమైన రక్షణను అమెరికా మనకు అందిస్తుందని కూడా వ్యాఖ్యానించేశాయి. చైనా మరీ దూకుడుగా వ్యవహరిస్తున్న ఆసియా–పసిఫిక్‌ రీజియన్‌లో కూడా ఇలాంటి తరహా సహకారాన్ని అమెరికా అందించలేదు. 1971 నుంచి చైనా దురాక్రమణను ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్‌ కేస్‌ స్టడీ దీన్నే నిరూపిస్తుంది.  ఆసియా–పసిఫిక్‌ రీజియన్‌లో అమెరికాకు అత్యంత పూర్వ మిత్రదేశం ఫిలిప్పీన్స్‌ అన్నది తెలిసిందే.

స్పానిష్‌ యుద్ధనౌకను మనీలా బే వద్ద అడ్మిరల్‌ జార్జ్‌ డివే ధ్వంసం చేసి వలసవాద స్పెయిన్‌ని 1898లో లొంగదీసుకున్నప్పటినుంచి అమెరికా–ఫిలిప్పీన్స్‌ సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధానంతరం నష్టపరిహారం కింద ఫిలిప్పీన్స్, గ్వామ్, ప్యూర్టోరికోలను అమెరికా హస్తగతం చేయడమే కాకుండా 20 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని కూడా స్పెయిన్‌ చెల్లించింది. ఆనాటి నుంచి జపానీస్‌ అక్రమణ జరిగిన మూడేళ్లు మినహా (1941–44), అమెరికా, ఫిలిప్పీన్స్‌ మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు చాలా సన్నిహితంగా సాగాయి. ప్రత్యేకించి 1946లో రిపబ్లిక్‌గా ఫిలిప్పీన్స్‌ స్వాతంత్య్రం పొందిన తర్వాత ఈ రెండుదేశాల మధ్య బంధం బలీయంగా మారింది. దీని ఫలితంగా ఫిలిప్పీన్స్‌ నుంచి అతిపెద్ద సంఖ్యలో (2018నాటికి 20 లక్షలమంది) అమెరికాకు వలసలు పెరిగాయి. 

ఇరుదేశాలూ 1947లో సైనిక స్థావరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1951లో పసిఫిక్‌ ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌ ఐలండ్‌ భూభాగాలతో సహా ఇరుదేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం నిరవధికంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా దక్షిణ చైనా సముద్రంలోని తమ దీవులలో ప్రవేశించడానికి, జోక్యం చేసుకోవడానికి అమెరికాకు ఫిలిప్పీన్స్‌ అనుమతించేసింది. అయితే దక్షిణ చైనా సముద్రంలోని ఈ దీవులపై తమకూ హక్కు ఉందని చైనా, తైవాన్, బ్రూనై, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాలు కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంనుంచి ప్రకటిస్తూ రావడంతో అమెరికా, ఫిలిప్పీన్స్‌ దీవుల్లోకి అడుగుపెట్టడం, ఆ వివాదంలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాకుండా పోయింది.

విదేశీయుల ఉనికి పట్ల స్థానికంగా వ్యతిరేకత తీవ్రమవడంతో క్లార్క్, సుబిక్‌ బే ప్రాంతంలోని సైనిక స్థావరాలను అమెరికా 1992లో ఖాళీ చేసింది. అయితే పెరుగుతున్న ఉగ్రవాదంతో పోరాడేందుకు 1998లో సైనిక సందర్శనల ఒప్పందం కుదిరి మరింత సైనిక సహకారం సాధ్యమవడంతో పై ఘటన ఇరుదేశాల సంబంధాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. అయితే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె దేశంలో మాదకద్రవ్యాలపై కఠిన వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో మానవహక్కుల దుస్థితిపై అమెరికా విమర్శలు ప్రారంభించడంతో 2016 నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త వేడెక్కుతూ వచ్చాయి. 2014 ఏప్రిల్‌ 28న ఇరుదేశాల సైన్యాల మధ్య విస్తృత రక్షణ సహకార ఒప్పందం కుదిరిన తర్వాత కూడా దక్షిణ చైనా సముద్రంపై అమెరికా విధానాన్ని ఒబామా యంత్రాంగం పునర్‌ వ్యాఖ్యానం చేసినప్పుడు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఒబామా పాలనాయంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అమెరికా చైనా మధ్య సహకారం ఇతర రంగాల్లో దెబ్బతింటుంది కాబట్టి ప్రాంతీయ వివాదాలలోకి తలదూర్చబోనని అమెరికా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో విస్తృత ఎకనమిక్‌ జోన్‌ అని చైనా చెప్పుకుంటున్న ప్రాంతంలో స్వేచ్ఛగా అన్ని దేశాల నౌకలు సంచరించడానికి అమెరికా ప్రాధాన్యమిచ్చింది. అయితే ఈ విధాన మార్పు వల్ల ప్రభావితమయ్యే దేశాలకు సాంత్వన కలగకుండా పోయింది. 

అమెరికా తనకు సహాయం చేయకుంటే తాను రష్యా లేదా చైనా పక్షం చేరడానికి కూడా సిద్ధపడతానని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టే బెదిరించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు విఘాతం ఏర్పడింది. శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు (పీసీఏ) ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా ప్రకటించిన తర్వాత కూడా చైనా దురాక్రమణతో వ్యవహరించడంలో తనకు అమెరికా సహాయపడలేదని డ్యుటెర్టే నిస్పృహ చెందాడు. 2013లో స్పార్టీ దీవులపై వివాదాన్ని కూడా ఫిలిప్పీన్స్‌ ఈ పీసీఏ ముందుకు తీసుకెళ్లింది. ఈ దీవిపై చైనా చారిత్రక హక్కు ప్రకటించడానికి ఎలాంటి చట్టబద్ధతా లేదని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు 2016 జూలై 12న తీర్పు చెప్పింది.

ఒబామా పాలనా యంత్రాంగంలా కాకుండా, ట్రంప్‌ పాలన చైనావైఖరిని మరింత కఠినంగా దుయ్యబడుతూ, దక్షిణ చైనా సముద్రంపై ఆసియన్‌ దేశాల హక్కుకు మద్దతునిస్తూ వస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో 2019 మార్చి నెలలో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడితో భేటీ జరిపి దక్షిణ చైనా సముద్రంలో పరస్పర రక్షణకు హామీ ఇచ్చారు. పైగా ఆ ప్రాంతంలో చైనా ప్రకటించిన హక్కుల్లో చాలావరకు అక్రమమని చెబుతూ చైనా వైఖరిని ఖండించాడు కూడా. 2019 ఏప్రిల్‌ 15న అమెరికా, ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖలు తాజాగా ప్రత్యేక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ప్రెసిషన్‌ కిల్‌ వెపన్‌ సిస్టమ్‌–ఐఐ పట్ల తగిన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఈ ఒప్పందం ప్రకటించింది. 

అయితే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, 2020 ఏప్రిల్‌ నెలలో వియత్నాం చేపల బోటును చైనా ధ్వంసం చేసినప్పుడు కానీ, 2019 ప్రారంభంలో ఫిలిప్పీన్స్‌ దీవులను 100 చైనా ఓడలు చుట్టుముట్టి హెచ్చరిక పంపినప్పుడు కానీ ట్రంప్‌ యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది. 2020 నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరగడానికి ముందుగా స్పార్టీదీవులపై దాడికి ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తాడని పుకార్లు వచ్చినప్పుడు అమెరికా సైనిక జోక్యం గురించిన వార్తలు మొదటిసారిగా వినవచ్చాయి. 

దీనిఫలితంగా, అమెరికా తమకు నిజంగా సహాయం చేస్తుందని ఫిలిప్పీన్స్‌ ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. 2019 డిసెం బర్‌లో ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన సర్వేలో 64 శాతం íఫిలి ప్పీన్స్‌ ప్రజలు తమకు అమెరికా సన్నిహత మిత్రురాలు అని భావిస్తున్నట్లు తేలింది. అమెరికా తనకు సన్నిహిత మిత్రురాలు అని భావించే దేశాల్లో ఇజ్రాయెల్‌ (82 శాతం) దక్షిణ కొరియా (71 శాతం)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న ఫిలిప్పీన్స్‌ దేశస్తుల్లో 47 శాతం మంది పెరుగుతున్న చైనా ఆర్థిక శక్తి మంచి పరిణామమేనని చెప్పగా 48 శాతం మంది అది చెడు పరిణామమని భావించారు.

మరీ ముఖ్యంగా తైవాన్‌ పరిశోధకుడు రిచ్చర్డ్‌ జావద్‌ హైదరియన్‌ ఆగస్టు 4వ తేదీన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ కోసం సమర్పించిన పరిశోధనా పత్రంలో ఫిలిప్పీన్స్‌ ప్రజల మనోభావాలను మరింత విస్తరించి చెప్పాడు. అమెరికాతో రక్షణ ఒప్పందాలు ఫిలిప్పీన్స్‌ ప్రజలకు ఉపయోగకరమేనా అనే ప్రశ్నకు కనీసం సగంమంది ప్రజలు తాము ఏమీ తేల్చుకోలేకపోతున్నామని చెప్పారు. కాగా 17 శాతం మంది ప్రజలు ఆ ఒప్పందంతో ఏ మేలూ జరగదని చెప్పారు. పైగా అమెరికాతో కంటే చైనా లేక రష్యాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టెకి సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు మద్దతివ్వడం గమనార్హం. అయితే ఈ ప్రశ్నకు 2015లో 43 శాతంమంది తమ దేశాధ్యక్షుడికి మద్దతు తెలుపగా 2017లో అది 67 శాతానికి పెరగడం విశేషం.

ఫిలిప్పీన్స్‌ అనుభవం నేపథ్యంలోంచి చూస్తే, అమెరికా పాలనాయంత్రాంగం పరివర్తనా స్థితిలో ఉంటున్నప్పుడు భారత్, అమెరికాల మధ్య ఇటీవల రక్షణ ఒప్పందం అంతిమంగా ఖరారైన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మనసులో ఏముండేది అనేది ప్రాధాన్యత కలిగిన విషయం. రాబోయే ఎన్నికల్లో జో బైడెన్‌ గెల్చినట్లయితే చైనా పట్ల భారత్‌ వ్యతిరేకత ఎలా పరిణమిస్తుంది? ఇతర రంగాల్లో అమెరికా, చైనా సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒబామా విధానం పట్ల మన వైఖరి ఏ రూపు తీసుకుంటుంది? పైగా రక్షణ రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వనప్పుడు ఈ ఒప్పందం నుంచి భారత్‌ పెద్దగా ఆశించేది ఏమీ ఉండదని గ్రహించాలి.
-వప్పాల బాలచంద్రన్‌
వ్యాసకర్త మాజీ ప్రత్యేక కార్యదర్శి, కేబినెట్‌ సెక్రటేరియట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top