
అభిప్రాయం
‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్ జాన్ డల్బర్గ్ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.
స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?
అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.
చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.
ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.
తటస్థత చూపనక్కర్లేదా?
అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్‌సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు.
తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్ ఖడ్‌కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్ ఖడ్ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది.
గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం.
నైతికత సారథులుగా వ్యవహరించాలి!
రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్‌ఖడ్ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు.
చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్ ఆఫ్ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు.
అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం.
దేశంలో ‘సివిల్ వార్’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్ టేలర్ కొలరిజ్ రాసిన ‘ద స్టేట్స్‌మన్స్ మాన్యువల్’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి.
తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.
అభయ్ మోకాశీ
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్