పొలం నుంచి వైఫల్యం వరకు...

Sakshi Guest Column On Farmers and Agriculture

విశ్లేషణ

దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ‘నేను దాన్ని పెంచాను. నేనే దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది కానీ నేను ఏం చేయగలను? గిట్టుబాటు ధరైనా రాకుంటే..’ అని కూరగాయలు, పండ్లు పండించే రైతు ఆవేదన చెందుతున్నాడు.

పంట ఉత్పత్తికి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్ని నాశనం చేయడమనేది రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ‘పొలం నుంచి వైఫల్యం వరకు’ అనే ఈ పునరావృత రైతు గాథ దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నదే. అంతేకాదు... కొన్ని సంవత్సరాలుగా ఈ విఫలగాథ మరింతగా విస్తృతమవుతూ వస్తోంది!

ఈ సంవత్సరం క్వింటాల్‌ బంగాళా దుంపల ధర రూ. 500లకు పడిపోయి నప్పుడు (గత సంవత్సరం రూ. 1,200లు సగటు ధర పలికింది) ఒక రైతు మీడియాతో ఏం చెప్పాడంటే... ‘‘క్వింటాల్‌ బంగాళా దుంపలను 900 నుంచి 1000 రూపాయల ధరకు తక్కువ అస్సలు అమ్మలేము.

ఎందుకంటే ఈ రేటు వద్ద అయితేనే మాకు దిగుబడి ఖర్చులు రావడమే కాకుండా కాస్త లాభం కళ్ల చూడగలం’’ అని. అయితే ఇప్పుడు బంగాళాదుంపల ధర ఏమాత్రం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో రానున్న కాలంలో బంగాళా దుంపల ఉత్పత్తిదారులు గడ్డు కాలాన్నే ఎదుర్కోనున్నారు.

పంజాబ్‌లోనే కాదు, బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా బంగాళాదుంపల ధర ఘోరంగా పతనం కానుంది. క్యాలిఫ్లవర్, క్యాబేజి, టమోటా ధరలు కూడా పడిపోయాయి. కేజీకి 3 రూపాయల ధర కూడా పలకదని గుర్తించక ముందే పంజాబ్‌లో రైతులు తమ పంటను ఇప్పటికే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ‘నేను దాన్ని పెంచాను.

నేను దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏం చేయగలను..’ అని కూరగాయలు పండించే రైతు ఒకరు అన్నారు. వీటి ఉత్పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్నీ నాశనం చేయడమనేది ఈ రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీయకుండా ఉంటుందా?!

ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్‌ జిల్లా ప్రాంతాల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ విరివిగా పండిన టమోటాకి కూడా ఇదే గతి పట్టడం చూశాను. టమోటా పంటను ఎందుకు పండించడం లేదని అడిగాను. నిరాశతో కనిపించిన టమోటా రైతు ఒకరు నాతో మాట్లాడుతూ, మార్కెట్‌ ధర కిలో టమోటాకు 2 రూపాయలు పలుకుతున్నప్పుడు టమోటాలను బుట్టల్లో సర్దడం, వాటిని రవాణా చేయడం వంటివాటికి అదనపు ఖర్చు పెట్టాలని తానను కోవడం లేదని చెప్పాడు. ‘మీకు ఎన్ని టమోటాలు కావాలంటే అన్నీ తీసుకోండి’ అని అతను నిస్పృహతో అన్నాడు. ‘పొలం నుంచి వైఫ ల్యానికి’ సంబంధించిన ఈ గాథను నేను ప్రతి చోటా చూస్తున్నాను.

దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలో చిస్తున్నట్లు లేదు. నేను ఎందుకిలా చెబుతున్నానంటే, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పక్షం రోజుల క్రితం ఒక నివేదిక వచ్చింది. మహాసముండ్‌కి చెందిన ఒక రైతు రాయపూర్‌ మండీకి వంకాయ పంటను తీసుకెళితే అతడికి రూ. 1,475 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కింద అదనంగా 121 రూపాయలను రైతే చెల్లించాల్సి వచ్చిందనీ ఆ వార్త తెలిపింది.

అంతకు ముందు నెల రోజుల క్రితం వెల్లుల్లి రైతులు తమ పంట మొత్తాన్ని స్థానిక నదుల్లో కలిపేశారన్న వార్తలు మీడియాలో రాజ్యమేలాయి. తర్వాత ఉల్లి పాయల సాగుదార్ల వ్యధలకు సంబంధించిన వార్తలు కూడా బయటికి వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, దేశంలో ఈ పరిస్థితి రోజువారీ కార్యక్రమంలా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, పొలం నుంచి వైఫల్యానికి సంబంధించిన గాథ మరింతగా విస్తృతమవుతూ వచ్చింది.

పొలంలో రైతు చిందిస్తున్న రక్తం మీడియాలో పేజీలకు మాత్రమే పరిమితమవుతోంది. స్టాక్‌ మార్కెట్‌లో రక్త పాతాన్ని దేశం చూస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి తీవ్ర స్పందన రైతుల వ్యధల పట్ల కలగడం లేదు. 

ఇది చాలదన్నట్లుగా, మార్కెట్‌లో జోక్యం చేసుకునే వ్యవస్థ (ఎమ్‌ఐఎస్‌)ను మరింతగా బలోపేతం చేయడంలో ఎలాంటి ప్రయో జనాన్నీ మన ఆర్థిక మంత్రి చూడడం లేదు! సమృద్ధిగా పంటలు పండి ధరలు పడిపోయినప్పుడు లేదా పంటలు చేతికొచ్చిన సమయంలో ఉత్పత్తి ధరకంటే తక్కువ ధరకు పడిపోయినప్పుడు ఎమ్‌ఐఎస్‌ రంగంలోకి దిగుతుందన్నది తెలిసిందే.

2023 బడ్జెట్‌ ఖర్చుల కింద, ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌), ఎమ్‌ఐఎస్‌లకు కేటా యింపులను బాగా తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎమ్‌ఐఎస్‌కి బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం దాన్ని కేవలం లక్ష రూపాయలకు కోసిపడేశారు. బడ్జెట్‌లో పొందుపర్చిన ఈ కేటాయింపు, కొద్దిమంది వెల్లుల్లి ఉత్పత్తిదారులకు కలిగిన నష్టాలను పూరించడానికైనా సరిపోతుందని నేను భావించడం లేదు.  

2018–19 బడ్జెట్‌లో రూ. 500 కోట్ల కేటాయింపుతో ప్రారంభించిన ఆపరేషన్‌ గ్రీన్స్‌ స్కీమ్‌ను గుర్తుంచుకోండి. టమోటో, ఉల్లి పాయలు, బంగాళాదుంపలు మామూలుగా ఎదుర్కొంటున్న అస్థిర ధరల నియంత్రణకు ఉద్దేశించినట్లు చూపించినప్పటికీ అవసరమైన దానికంటే తక్కువగా బడ్జెటరీ కేటాయింపులు చేశారు. ఆపరేషన్‌ ఫ్లడ్‌ ప్రాతిపదికన, కనీసం ఈ మొత్తాన్నయినా ప్రకటించారు.

ఈ పథకాన్ని అన్ని పండ్లు, కూరగాయలకు వర్తింపచేస్తూ, ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కింద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ని మరింతగా విస్తరించింది. కానీ 2023 నాటికి ఈ పథకాన్ని దాదాపుగా విస్మరించేశారు. కూరగాయల ధరలు (పండ్ల విషయంలో కూడా) పడిపోయిన ప్రతి సందర్భంలోనూ నేను ట్వీట్‌ చేసినప్పుడు, ఇవి పాడైపోయే సరకులు అని సాధారణ పల్లవి పాడుతూ వచ్చేవారు. సాధారణ ప్రజానీకం నుంచి ఈ మాటలు వింటే వాటిని సులువుగా పక్కనపెట్టేయవచ్చు కానీ విధాన నిర్ణేతలు ఇంత భిన్నంగా ఉండ టానికి ఇది కారణం కాకూడదు. 

అమెరికాలో కూడా, ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్ట పోకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చారు. పాలధరలు పడి పోయిన సమయాల్లో స్కూల్‌ ఫీడింగ్‌ ప్రోగ్రామ్‌లలో పొందు పరిచేలా రైతులు మరింత చీజ్‌ని తయారు చేయాలని రైతులను కోరే యంత్రాంగాన్ని అమెరికా రూపొందించింది.

అలాగే స్ట్రాబెర్రీ ధరలు పతనం అయే సమయాల్లో ఇదే విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతిదీ సజావుగా ఉంటుందని చెప్పలేం కానీ, వ్యవ సాయ క్షేత్రాల నష్టాలను తగ్గించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగు తున్నాయి. 

భారత్‌లో తగిన ఉష్ణోగ్రతా నియంత్రిత నిల్వ సౌకర్యాలు, ప్రాసె సింగ్‌పై ఆధారపడి ఉండే వాల్యూ ఛెయిన్‌ని పునర్నిర్మించడానికి, స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయ త్నాలు చేపట్టాలి. ధరల క్షీణత పథకాన్ని అమలు చేసే యంత్రాంగం ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ మధ్యప్రదేశ్‌లో గతంలో స్కీమ్‌ పైఫల్యం చెందడం అనేది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.

అయితే మరింత ముఖ్యంగా ధరల అస్థిరత్వాన్ని అధిగమించడానికి రైతుల కోసం గ్యారంటీ ధరకు హామీ పడటం మార్గదర్శక స్ఫూర్తిగా ఉండాలి. కూరగాయల పెంపకందార్లకు గ్యారంటీ ధరను అందిస్తున్న కేరళ స్కీమ్‌ నుంచి వెలికివచ్చిన పాఠాలను నేర్చుకోవలసి ఉంటుంది.

రైతుల కోసం భవిష్యత్తులో పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడంలోనే కాదు.. వైవిధ్యభరితమైన పంటల వైపు మారే విషయంలో వారికి సహకారం అందివ్వడంలో ఆపరేషన్‌ గ్రీన్స్ కి అతి పెద్ద సవాలు ఎదురవుతోంది. వినియోగదారులు ఇప్పటికే అత్యధిక మార్కెట్‌ ధరను చెల్లిస్తున్నారు.

కానీ భారీగా ఆర్గనైజ్‌ అయివుండే వ్యాపారంలో కూడా జరిగే బేరసారాల్లో రైతులే నిండా మునిగి పోతున్నారు. కాబట్టి పొలం నుంచి వైఫల్యానికి చెందిన గాథ మారాల్సి ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ దుఃస్థితికి గాను సప్లయ్‌ – డిమాండును మాత్రమే మనం నిందిస్తూ కూర్చోలేము.

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top