‘భీమా కోరేగావ్‌’ స్ఫూర్తితో పోరాడుదాం!

Sakshi Guest Column On Bhima Koregaon caste system

కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుండి విముక్తి పొందడానికి మహార్‌ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరఫున రెండవ బాజీరావు పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారు.

ఈ విజయానికి సూచనగా అప్పటి బ్రిటిష్‌ గవర్నమెంట్‌ కోరేగావ్‌ వద్ద మహార్‌ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి, ఆ స్థూపంపై యుద్ధంలో చనిపోయిన 22 మంది మహార్‌ వీరుల పేర్లను చెక్కించారు. భీమా నది ఒడ్డున నిర్మించిన మహార్‌ వీరుల స్మారక విజయ స్తంభాన్ని 1927లో డాక్టర్‌ అంబేడ్కర్‌ సందర్శించే వరకు భీమా కోరేగావ్‌ చరిత్ర... స్వతంత్ర పోరాటం పేరుతో వక్రీకరణకు గురైంది.

అక్కడ జరిగిన యుద్ధం బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా మరా ఠాలు చేసిన స్వాతంత్య్ర పోరాటంగా కుహనా చరిత్రకారులు చిత్రించారు. 

నిజానికి చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే... మహార్‌ వీరులు ఆ యుద్ధంలో తమ పట్ల పీష్వాలు అనుసరిస్తున్న అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా... తమ విముక్తి కొరకే పాల్గొన్నా రనేది వాస్తవం. అంబేడ్కర్‌ భీమాకోరేగావ్‌ వద్ద విజయాన్ని మరాఠా పీష్వాల రాజ్యంలో ‘బ్రాహ్మణీయ అణచివేతపై దళిత ఆత్మగౌరవ  ప్రతీకగా’ ప్రకటించడంతో అసలు చరిత్ర వెలుగు లోకి వచ్చింది.

మరాఠా సామ్రాజ్యంలో నిజానికి పీష్వాలు దళితులపై చేస్తున్న కుల అణచివేత, ఆగడాలు అంతా ఇంతా కాదు. నడుముకు చీపురు, మూతికి ముంత కట్టించారు. దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆయుధాలు నిరాకరించి పశువుల కన్నా హీనంగా చూస్తున్న పీష్వాల పాలనలో పోరాటం తప్పితే మరేమీ మిగల్లేదు.

యుద్ధానికి ముందు మహార్ల నాయకుడైన సిఖ్‌ నాయక్‌... పీష్వా సైన్యాధికారిని యుద్ధం  జరగకుండా ఉండాలంటే... తమను మనుషులుగా గుర్తించి, అంటరానితనం పాటించడం నిలిపివేసి కనీస హక్కులు ఇవ్వాలని అడిగాడు. ‘మీరు యుద్ధం చేసి గెలిచినా కూడా అస్పృశ్యులే, మీ అంటరానితనం పోదు.

మీరు ఎప్పుడూ మా కాళ్ళకింద ఉండేవారే’ అని కండకావరంతో సైని కాధికారి మాట్లాడటంతో యుద్ధం అనివార్యమైంది. అత్యంత బలస్థులూ, పోరాట యోధులైన మహర్‌ యువకులు ఆ మాటలతో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. 

రెండు రోజులు కాలినడకన ప్రయాణం చేశారు. వెంట తెచ్చుకున్న రొట్టెలు అయిపోయాయి. అయినా ఆకలితో ఉండి కూడా భీమా నది ఒడ్డున 1818 జనవరి ఒకటవ తేదీనాడు 20 వేల అశ్వికదళం, 8 వేల పదాతిదళం కలిగినన పీష్వాల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. ఇది ముమ్మాటికీ కుల పీడనపై ‘ప్రతిఘటన’గానే మనం చూడాలి.

నేడు కుల వ్యవస్థ ఆధునిక రూపాలు సంతరించుకొని గ్రామాల నుండి పట్టణాల వరకూ, పాఠశాలల నుండి యూని వర్సిటీల వరకూ, చిన్న పని ప్రదేశాల నుండి కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ రాజ్యమేలుతోంది.

రోజురోజుకు బలోపేతం అవుతున్న హిందూత్వ ఫాసిజం  మనుస్మృతిని అధికారికంగా నెలకొల్పే దిశగా పయనిస్తున్నది. దళిత బహుజనుల నీడ, గాలి సోకకుండా వారి మానవ హక్కు లన్నింటినీ నిషేధించిన పీష్వాల అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతి రేకంగా సాగిన భీమా కోరేగావ్‌ పోరాటాన్ని ఎత్తి పడుతూ అంబేడ్కర్‌ ఆ పోరాటాన్ని ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించి, దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు.

అనంతరం ఈ దేశ రాజ్యంగంలో దళితులకు హక్కులను పొందుపర్చడంతో పాటు కుల వర్గ పీడన అంతం కావాలని ఆశించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన మహిళలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలతో కూడిన బహుజన సమాజపు విముక్తికై వినూత్న మార్గంలో పోరాడారు. అయినా కొత్త పీష్వాలు అధికారాన్ని చలాయిస్తున్న సందర్భంలో మళ్లీ మనువాదం పూర్తి స్థాయిలో జడలు విప్పుకునే అవకాశం ఉంది. అందుకే బహుజన సమాజం అప్రమత్తతతో ఉండాలి.
– కోట ఆనంద్, కుల నిర్మూలన వేదిక రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ‘ 96523 57076
(నేడు భీమా కోరెగావ్‌ పోరాటం జరిగిన రోజు)  

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top