ముంచే గాలివాటు రాజకీయాలు

Sakshi Guest Column On Andhra Pradesh Politics And Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ గత శాసనసభ ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు పవన్‌ కల్యాణ్‌. పరువూ పోయింది, ‘పవరూ’ రాలేదు. అయినా తన డంబపు ‘పవనిజం’ స్లోగన్‌ను వదులుకోలేదు. అంతవరకే అయితే సరే అనవచ్చు. కానీ ఆయన ఏ నిశ్చితాభిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజురోజుకూ రుజువవుతోంది. అదే ఆయనతో ‘నేనెవరితోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అనేలా చేస్తోంది. అన్నట్టూ– పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెడుతుందట అన్న సామెత మనకు ఉండనే ఉంది. 

శతాబ్దాలకు సరిపడా నీతుల్ని శతక వాఙ్మయ కర్తలు ఎందుకు బోధించి పోయారోగానీ, అవి నేటి భ్రష్ట రాజకీయ సంస్కృతికి ప్రత్యక్షర సాక్ష్యాలుగా నిలిచి పోతున్నాయి. ‘గాలి వాటు’ రాజకీయాలకు పేరు మోసిన పవన్‌ కల్యాణ్‌ నిశ్చితా భిప్రాయం లేని ‘వ్యామోహాల పుట్ట’ అని రోజు రోజుకూ రుజువ వుతోంది. ‘వారాహి’ వాహనాన్ని చూపి దాన్నొక బెదిరింపు సాధనంగా చూపెడుతున్నాడు. ‘వ్యామోహాలు’ ఎలాంటివో వేమన నిర్వచించి పోయాడు: ‘‘ఈ దేహమే వ్యామోహాల పుట్ట.

కానీ అశాశ్వతమై పగిలి పోయే ఓ కుండ. ఈ శరీరం తొమ్మిది కంతల తిత్తి. ఆ ‘తిత్తి’కి ఒంటి నిండా దిగేసే సొమ్ములు చాలక కులాలు, గోత్రాల పేర్లు కూడా ఆభరణాలుగా తగిలించుకుని ఊరేగుతున్నారు’’. అల్ప బుద్ధివాడు అధికారంలోకి వస్తే మంచివాళ్లందర్నీ తొలగ్గొడతాడనీ, ఇదెలాంటిదంటే ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందన్న’ సామెత లాంటిదనీ అన్నాడు. 

బహుశా అందుకనే పోతనామాత్యుడు కూడా మనిషి బుద్ధుల్ని నాలుగైదు రకాలుగా వర్ణించి పోయాడు. అవి: ‘కుబుద్ధి, మంద బుద్ధి, అల్ప బుద్ధి, దుర్బుద్ధి’ అని! ఈ అవకాశవాద బుద్ధే, ఇప్పుడు ‘నేనెవరి తోనైనా సరే పొత్తులకు సిద్ధం’ అని పవన్‌ చేత అనిపిస్తోంది. గత ఎన్నికల్లో ‘బింకానికి’ పోయి రెండు చోట్ల నిలబడి, అభాసుపాలై ఘోరాతిఘోరమైన ఓటమి పాలయ్యాడు. ఫలితంగా పరువూ పోయింది, ‘పవరూ’ దూరమై పోయింది. ఇన్ని దారుణ అనుభవాల నుంచి కూడా పవన్‌ తన ‘పవనిజం’ అన్న పాత స్లోగన్‌ను మాత్రం వదులుకో లేకుండా ఉన్నాడు. 

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగ తుల అభ్యున్నతికి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే అవసరాన్ని తొలి సారిగా గుర్తించి దానికి చట్టరూపం ఇవ్వాలన్న తలంపు మొదటి సారిగా 2001లోనే ప్రతిపక్ష నాయక హోదాలో వైఎస్‌ రాజశేఖర రెడ్డికి వచ్చింది. ఆయన ప్రతిపాదించిన దరిమిలానే దళిత వర్గాలకు ‘సబ్‌ ప్లాన్‌’ చట్టం వచ్చింది. ఆ చట్టం కాలపరిమితి మొన్నటి జనవరి 23తో ముగియవలసింది.

కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో ముందడుగు వేసి దాన్ని మరొక పదేళ్లకు పొడిగిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని నిర్ణయించడం వల్ల దళితుల, ఆదివాసీల అభ్యున్నతికి ఈ చర్య ఎంతో దోహదం చేస్తుంది. సకల దళిత శక్తులు వివిధ దశల్లో సమీకృతమైన ఫలితమే ‘సబ్‌ ప్లాన్‌’. ఆ నిధులు దుర్వినియోగమై పక్కదారులు పడుతున్నాయని సబ్‌ ప్లాన్‌ లక్ష్యాల గురించిన అవగాహన లేని పవన్‌ వాపోవడం కేవలం ఆయన ద్వేష భావననే బట్టబయలు చేస్తోందని చెప్పక తప్పదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ప్రజా బాహుళ్యానికి మాత్రం గణనీయమైన స్థాయిలో ఒరిగిందేమీలేదంటూ అంబేడ్కర్‌ తన బాధను చివరి శ్వాస వరకూ వ్యక్తం చేస్తూనే వచ్చారు. ‘‘షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతుల బతుకుతెరువులు ఆచరణలో బాగుపడనంత కాలం, ఆ వైపుగా సమూలమైన, సమగ్ర మైన మార్పులు రానంత కాలం భారతదేశ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని అంబేడ్కర్‌ స్పష్టం చేశారని సుప్రసిద్ధ జాతీయ వ్యంగ్య చిత్ర వారపత్రిక ‘శంకర్స్‌ వీక్లీ’ (1953 ఫిబ్రవరి) నివేదించింది.

అంతేగాదు,  కళావంతులైన దేవదాసీలకు చెందిన కేసరీబాయి కేర్కర్‌ (1892–1977) స్వరంతో ‘వందేమాతరం’ గ్రామఫోన్‌ రికార్డును సిద్ధం చేయాలనీ, ఆ తొలి కాపీని తానే కొంటాననీ ప్రకటించినవారు అంబేడ్కర్‌! ఎందుకంటే ‘సురశ్రీ’గా పేరొందిన కేర్కర్, జైపూర్‌కు చెందిన అత్రౌలి ఘరానాలో 20వ శతాబ్దపు క్లాసికల్‌ సింగర్‌గా పేరొందిన హిందూస్తానీ సంగీత విద్వాంసుడు అల్లాదియా ఖాన్‌ వద్ద శిక్షణ పొందిన విషయాన్ని బహిర్గతం చేశారు అంబేడ్కర్‌. 

హైందవంలోని కుల వ్యవస్థను, పరమత విద్వేష భావాలను వ్యతిరేకించిన అంబేడ్కర్‌ చివరికి బౌద్ధ ధర్మాన్ని ప్రేమించి ఆహ్వానించవలసి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలలో పాల్గొనే సభ్యులపై ఏయే అనర్హతా నిబంధనలను విధించాలో 1951లోనే ప్రత్యేక బిల్లును ఆయన రూపొందించారు. శాసన వేదికల్లోని సభ్యులకు రాజకీయ పదవుల ఆశ జూపడం ద్వారానో, మరే ఇతర ప్రయోజనాలు కల్పి స్తామనో ప్రలోభాలకు గురిచేసే పార్లమెంట్‌ వేదిక వల్ల ప్రయోజనం లేదు.

ఎలాంటి భీతి లేదా ప్రలోభమో ప్రభుత్వం నుంచి లేకుండా పార్లమెంట్‌ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే అలాంటి ‘పార్లమెంట్‌’ వల్ల గానీ, శాసనసభ వల్లగానీ ప్రజలకు ఉపయోగం ఉండదు. అలాంటి స్థితిలోనే పాలకులకు ‘డూడూ బసవన్న’లుగా  వ్యవహరిస్తారని అంబేడ్కర్‌ హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లోనే పార్లమెంట్‌ (లేదా శాసన వేదిక) కాస్తా స్టాక్‌ ఎక్స్‌ఛేంజి వ్యాపార మార్కెట్‌గా ఎలా మారిపోతుందో అంబేడ్కర్‌ ఉదాహరించారు.

అంతేగాదు, బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలో ఉన్న షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థుల సంఖ్యకన్నా స్వతంత్ర భారత ప్రభుత్వ కొలువులో ఉన్న వారి సంఖ్య బహు తక్కువనీ, ఆ మాటకు వస్తే తన స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతినే తారుమారు చేయడానికి ముసాయిదా సంఘంలోని కొందరు సభ్యులు సాహసించిన విష యాన్నీ కూడా అంబేడ్కర్‌ బయట పెట్టాల్సి వచ్చిందని మరచి పోరాదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలలో అధికారం కోసం, దళిత వర్గాలపై ఆధిపత్యం కోసం కేవల పదవీ కాంక్షతో కక్షిదారులైన కొందరు అగ్ర – అర్ధ అగ్రవర్ణాలకు చెందిన ‘వినాయకులు’ పని చేస్తున్నారన్నది పచ్చి నగ్న సత్యం. బహు పరాక్, ప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు పియరీ నోరా అన్నట్టు– ‘‘జ్ఞాపక శక్తి ఉన్న చోటునే మరుపు పెద్దమ్మ కూడా వెన్నంటే ఉంటుంది’’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top