ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?

Sakshi Guest Column On Agnipath Scheme by ABK Prasad

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్‌’ సృష్టించిన అగ్నిగుండం ఏమిటో మనకు తెలుసు. త్రివిధ దళాల్లో యువ సైనికుల్ని తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకానికి కేంద్రం తెర లేపింది. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని భావించినందునే అభ్యర్థులు భారీ ఆందోళనకూ, విధ్వంసకాండకూ దిగారు. అయితే ఈ పథకం తేవడానికి కారణం ఏమిటి? సైన్యంలో పెన్షన్‌ వ్యయం పెరగడం! దీనికి నిజంగా చేయవలసింది – ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకోవడం! కానీ ప్రభుత్వం దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పజెబుతోంది; పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఎదురుడబ్బులు ఖర్చుచేసింది. ఇన్ని అస్తవ్యస్త విధానాలను అమలుచేస్తున్న ప్రభుత్వం సైన్యంలో వ్యయం పేరిట ఉద్యోగావకాశాల మీద నీళ్లు జల్లితే అభ్యర్థులకు ఆగ్రహం రాదా?

భారతదేశంలో క్రమక్రమంగా ప్రభుత్వ రంగం కొడిగట్టిపోతూ వస్తోంది. 2014 ఎన్నికల తర్వాత అది మరింత వేగంగా బీజేపీ–ఆరెస్సెస్‌ ‘హిందూత్వ’ ఎజెండా చాటున ప్రైవేట్‌ ‘దుకాణం’గా స్థిరపడుతోంది. ఆ పరిణామంలో భాగంగానే – త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ‘అగ్నిపథ్‌’! సైనిక దళాల్లో చేరడానికి పాత రిక్రూట్‌మెంట్లలో అవసరమైన వివిధ దశల్ని (పరీక్షల్ని) పూర్తి చేసుకున్న అభ్యర్థులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకా నికి కేంద్రం తెర లేపింది.

రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు రాసి పాసైన అభ్య ర్థులు తమను ప్రభుత్వం మోసం చేస్తోందని భావించి, దీనికి నిరస నగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకూ, విధ్వంసకాండకూ దిగారు. శాశ్వత రిక్రూట్‌మెంట్‌ పథకం ద్వారా కాకుండా తాత్కాలిక అవసరాల కోసం తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అభ్యర్థులు భావించినందునే ఈ స్థాయిలో భారీ విధ్వంసకాండకు దిగారు.

ఎందుకీ కొత్త ఎత్తుగడ?
అభ్యర్థుల్ని ‘స్వల్ప కాలం పాటు’ ఆర్మీలో పని చేయడానికి మాత్రమే అనుమతించాలన్న నిబంధనను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? సైనిక, నావిక, విమాన సర్వీ సుల్లో పనిచేసే ఉద్యోగులకు పెరిగిపోతున్న పెన్షన్‌ చెల్లింపులకు కోత పెట్టడానికి ఈ కొత్త ఎత్తుగడను ప్రభుత్వం ఎత్తింది. ఇది పేరుకు ‘అగ్నిపథ్‌’. మరో మాటలో అగ్నిగుండం అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్‌ రంగానికి ధారాదత్తం చేసే పథకాల్ని బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమి పాలకులు 2014 నుంచే అమలు చేస్తున్నారు. దీని పరాకాష్ఠ – కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సహితం ప్రభుత్వ రంగం నుంచి తప్పించడం. దాన్ని ప్రైవేట్‌ రంగానికి కట్టబెట్టాలని నిర్ణయిం చినప్పుడే ఇది దేశ ప్రజలందరికీ అర్థమయింది.

విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్‌ రంగంలో కాపాడుకునేందుకు విశాఖలోనూ, దేశ వ్యాప్తం గానూ ఈ రోజుకూ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ‘మొండికీ, బండకూ’ ఆయుష్షు ఎక్కువన్నట్టుగా దేశ పాలనా వ్యవస్థ ప్రవర్తిస్తోంది. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే– ఇలాంటి ఆందోళ నలు తలెత్తడానికి గల కారణాలను విశ్లేషించుకొని సకాలంలో సవర ణలను చేసుకోవాలనీ, ‘కక్షలు, కార్పణ్యాల’తో పరిష్కారాలు కుదర వనీ ప్రపంచవ్యాప్తగా మొండి పాలకులకూ, ప్రభుత్వాలకూ తెలియని పాఠమా?

ప్రతి సంవత్సరమూ, దేశ రక్షణ బడ్జెట్‌లో సగానికి పైగా ఉద్యోగుల పెన్షన్‌ల కిందనే పోతోందనీ, పరిశోధన, అభివృద్ధి రంగా లకు ఐదు శాతం కన్నా తక్కువే అందుతోందనీ, రెవెన్యూ ఖర్చులో 70 శాతం రక్షణ బడ్జెట్‌కే ఖర్చు అవుతోందనీ ‘నీతులు’ చెప్పడానికి అలవాటు పడ్డారు పాలకులు. కానీ ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు ఇతోధికంగా పెంచుకోవడం పట్ల పాలనా వ్యవస్థ శ్రద్ధ పెట్టడం లేదు.

రక్షణ విధానాల్లో మార్పు వచ్చేలా దేశ రక్షణ బడ్జెట్‌ను రూపొందించుకోవడం లేదు. ఏదో ఒక మిషతో ఉద్రిక్తతల సడలింపుపైన శ్రద్ధ వహించడం లేదు. ఇందువల్ల దేశానికీ, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకూ కలుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. దీన్నే భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ‘ది ఇండియా వే’ (భారత మార్గం) అన్న తన కొత్త గ్రంథంలో కూడా స్పష్టం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో దేశాల మధ్య సంబంధాలు మెరుగై ఉన్నందున, ఆ పరిస్థితిని చెక్కు చెదుర్చుకోరాదనీ... దేశాల సరి హద్దులు, సంబంధ బాంధవ్యాలు పరస్పరం విడదీయరానివనీ జై శంకర్‌ చెబుతున్నారు.

ఈ నిర్వాకాలతో ఒరిగిందేమిటి?
కానీ గత పదేళ్ల వ్యవధిలో జరుగుతున్నదేమిటి? ఏదో ఒక మిష పైన, లేదా పాలక అవసరాల పైన, దేశ సైన్యం పేరిట... ‘హిందూత్వ’ ఎజెండా పేరిట... నల్లధనాన్ని వెలికి తీయకుండానే దాని పేరిటా దేశీయ కరెన్సీతో పాలకులు చెలగాటం ఆడుకున్నారు. దీనివల్ల మాసాలు, సంవత్సరాల తరబడీ సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక, బ్యాంకుల వద్ద గంటల తరబడీ పడిగాపులు పడవలసి వచ్చింది. ఆ క్రమంలో సుమారు 150 మంది బ్యాంకుల వద్దనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి మనకు తెలుసు! అంతకుమించి, కొత్త నోట్ల సృష్టి కోసం ఎదురు 25 వేల కోట్ల రూపా యలు ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ధారాదత్తం చేసుకోవలసి వచ్చింది.

ఇన్ని అనవసర ఖర్చులు పెడుతున్న ఈ అనుభవాలన్నింటి దృష్ట్యా ‘అగ్నిపథ్‌’ పథకాన్ని అగ్నితో చెలగాటం అనక తప్పదు. ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్‌మెంట్‌ విధానాన్నేగాక, యువ సైనికుల స్వభావాన్ని కూడా మౌలికంగానే దెబ్బ తీస్తుంది. అంతే గాదు, నిజానికి ఇదే బీజేపీ ప్రభుత్వం ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్‌’ అన్న పథకాన్నే అమలు జరుపుతామని హామీ ఇచ్చి పరిపాలనకు వచ్చింది. తీరా ఆచరణలో ‘ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు’ పొమ్మనే నిర్ణయా నికి రావడం ప్రస్తుత గందరగోళానికి దారితీసింది. ఇది ఆర్మీ ఉద్యో గార్థులకూ మింగుడుపడని అంశం కాదా? ఆర్మీ ఉద్యోగార్థుల రిక్రూట్‌ మెంట్‌ గరిష్ఠ వయఃపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినట్టు పాల కులు చేతులు కాలిన తరువాత ప్రకటించబోవడం మరొక విడ్డూరం! 

దేశ భద్రతకు ప్రమాదం
అంతేగాదు, సైన్యంలోకి రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికపై రిక్రూట్‌ చేయడం 1966 నుంచీ అమలులో ఉంది. అలాగే, మన పార్ల మెంట్‌ను కూడా రానురానూ 500 మంది సభ్యుల్లో ఎక్కువగా పురు షులతోనే నింపడం ఎక్కువైంది. ఒకనాడు– 1952లో భారత రిపబ్లిక్‌ తొలి పార్లమెంట్‌ సమావేశంలోనే హేమాహేమీలైన 22 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. విశేషమేమంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న వేళ, అమృత మహోత్సవాలు నిర్వహించు కుంటున్న దశలో కూడా నాయక స్థానాల్లో ఉన్న మహిళలను అధ్య క్షులనో లేదా పార్టీ నాయకురాళ్లనో చెబుతూ ఉంటారేగానీ, గౌరవ పార్లమెంట్‌ సభ్యురాళ్లని మనం పిలుచుకోలేకపోతున్నాం. 

ఈ రోజుల్లో కేంద్రంలో పాలక రాజకీయ పక్ష సైద్ధాంతిక దృక్పథం కారణంగా దేశంలో ఫెడరల్‌ (సమాఖ్య) వ్యవస్థలో అస్తవ్యస్త స్థితి దాపురించింది. ఫెడరల్‌ వ్యవస్థ ఉనికికి అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌ పాలకులు గండి కొడుతున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అస్తవ్యస్త విధానం కూడా ఈ కోవ లోనిదే. తాజాగా కేంద్ర పాలకులు వ్యయాన్ని మిగిల్చే పేరిట తీసుకున్న నిర్ణయం మూలంగా వృత్తి గౌరవాన్నీ, సమాజ సుస్థిరతనూ, తద్వారా దేశ భద్రతనూ ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుందని సుప్రసిద్ధ పరిశోధనా సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌’ కేంద్రం సీనియర్‌ పరిశోధకులు సుశాంత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

‘హిందూత్వ’ రాజకీయాల్లో భాగంగా మత మైనారిటీల ఆస్తుల్ని కూలగొట్టే దుర్మార్గపు చర్యల్ని సుప్రీంకోర్టు నిశితంగా విమర్శించ వలసి వచ్చింది. అలాగే, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్మీలో విశిష్ట పాత్ర నిర్వహిస్తూన్న సిక్కు, డోగ్రా, మద్రాసు రెజిమెంట్‌ వగైరా ఫెడరల్‌ యూనిట్లను తక్కువ చేసినట్టు అవుతోందని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఖండించవలసి వచ్చింది! ఏది ఏమైనా, ప్రతిష్ఠ కోసం పెద్దనాయుడు చస్తే ఈడ్వలేక ఇంటిల్ల పాదీ చచ్చారన్నట్టుగా పాలకుల ప్రవర్తన ఉండకూడదు సుమా!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top