బైబిల్‌... షేక్‌స్పియర్‌... అగథా క్రిస్టీ! | Sakshi Guest Column On Agatha Christie novels | Sakshi
Sakshi News home page

బైబిల్‌... షేక్‌స్పియర్‌... అగథా క్రిస్టీ!

Published Wed, Apr 30 2025 6:07 AM | Last Updated on Wed, Apr 30 2025 6:07 AM

Sakshi Guest Column On Agatha Christie novels

కామెంట్‌

ఎప్పటికీ గుర్తుండిపోయే నా టీనేజ్‌ జ్ఞాపకం: నేను అగథా క్రిస్టీ నవలల్ని చదవటం! అంతుచిక్కని క్రిస్టీ హత్యోదంతాలలో గల్లంతవుతూ ఉక్కపోత వేసవి మధ్యాహ్నాలను గడిపేవాడిని. ప్రధానంగా హెర్క్యూల్‌ పాయ్‌రోట్, మిస్‌ మార్పుల్‌ (క్రిస్టీ నవలల్లోని కల్పిత డిటెక్టివ్‌ పాత్రలు)ల అపరాధ పరి శోధనలు నన్ను కదలనివ్వకుండా చేసేవి. తక్కిన డిటెక్టివ్‌ పాత్రలు... టామీ, టపెన్స్‌ బెరెస్‌ఫోర్డ్‌; పార్కర్‌ పైన్, హార్లీ క్విన్‌ అనే వాళ్ల గురించి నాకసలు ఏమీ తెలియకపోయినా... క్రిస్టీ 66 డిటెక్టివ్‌ నవలలు రాశారనీ, అవి 200 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయనీ; బైబిలు, షేక్స్‌పియర్‌ రచనలు మాత్రమే ఆ సంఖ్యను దాటిన ప్రచురణలనీ, క్రిస్టీ నవలలు వందకు పైగా భాషలలోకి తర్జుమా అయ్యాయనీ అస్పష్టంగానైనా తెలుసు. 

అగథా క్రిస్టీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాకు దాదాపుగా ఏమీ తెలియదు. అయితే ఆ లోటును, గత వారం నేను అనుకోకుండా చూసిన రెండేళ్ల నాటి లూసీ వర్స్‌లీ ‘అగథా క్రిస్టీ’ జీవిత చరిత్ర భర్తీ చేసింది. ఆమె ఇంగ్లండ్‌ రచయిత్రి. ఆమె తండ్రి అమెరికన్‌. క్రిస్టీ అనే పేరు ఆమెకు మొదటి భర్త నుండి వచ్చింది. వాళ్ల ఏకైక సంతానం కుమార్తె రోసాలిండ్‌. వారి వైవాహిక జీవితం 1914 నుండి 1928 వరకు కొనసాగింది. భర్తకున్న వివాహేతర సంబంధం చివరికి ఆమె చేత అత్యంత బాధా కరమైన విడాకులకు దారి తీయించింది. 

ఆ తర్వాత రెండేళ్లకు క్రిస్టీ తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ఒక పురావస్తు శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. మధ్య ప్రాచ్యంలో అతడు జరిపిన తవ్వకాల ద్వారానే క్రిస్టీ ఇరాక్‌ (మెసపటేమియా), ఈజిప్టుల గురించి తెలుసుకున్నారు. భర్త తవ్వకాల పనికి చాలా వరకు క్రిస్టీనే డబ్బును సమ కూర్చారని పుస్తక రచయిత్రి వర్స్‌లీ రాశారు. ప్రతిఫలంగా ఆమెకు ‘డెత్‌ ఆన్‌ ద నైల్‌’, ‘మర్డర్‌ ఇన్‌ మెసపటేమియా’, ‘మర్డర్‌ ఆన్‌ ది ఓరియెంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ అనే మూడు పుస్త కాలు రాసేందుకు ముడి సరకు లభించింది. ఆమె తరచూ భర్త పాల్గొనే పురావస్తు త్రవ్వకాల దగ్గరకు వెళుతూ ఉండేవారు.  

బహుశా మీలో చాలామందికి అగథా క్రిస్టీ అనే ఆవిడ ‘థ్రిల్లర్‌’ల నవలా రచయిత్రి అని తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ‘మేరీ వెస్ట్‌మెకాట్‌’ పేరుతో ఆమె ఆరు రొమాంటిక్‌ నవలలు రాశారు. ఆమె నిష్ణాతురాలైన నాటక రచయిత్రి కూడా! వాటిల్లో ప్రసిద్ధి చెందిన రెండు నాటకాలు ‘మౌస్‌ ట్రాప్‌’, ‘విట్నెస్‌ ఫర్‌ ద ప్రాసిక్యూషన్‌’. మొదటి నాటకాన్ని లండన్‌ వెస్ట్‌ ఎండ్‌ థియేటర్‌లో 1952 నుండి 2020 వరకూ ప్రద ర్శించారు. ఇంకా నడిచేదే కానీ, కోవిడ్‌ రాకతో తాత్కాలి కంగా నిలిపి వేయవలసి వచ్చింది. తిరిగి 2021 నుండి నిరవధికంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. 

హెర్క్యూల్‌ పాయ్‌రోట్‌ ఆమె అత్యంత ప్రసిద్ధ కాల్ప నిక డిటెక్టివ్‌ పాత్ర. అయితే ఆ పాత్రను మోయటం ఆ ‘కల్పితుడికి’ తలకు మించిన పనైపోయిందని క్రిస్టీ తల పోశారు. 1975 నాటి ‘కర్టెన్‌’ నవలలో చివరిసారి అతడు కనిపించాక, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన మొదటి పేజీలో అతడికి శ్రద్ధాంజలి ఘటించింది. 

అగథా 86 సంవత్సరాలు జీవించారు. ఆమె తన 80లలో కూడా రాస్తూనే ఉన్నారని వర్స్‌లీ వెల్లడించారు. ‘‘ఆమె చనిపోయాక, ఆమె చివరి రాత పుస్తకాల్లో సైతం, తర్వాత రాయబోయే నవల కోసం తన ఆలోచనల్ని రాసి పెట్టుకున్నారు. అవి పూర్తిగా కొత్త ఆలోచనలు. ఇద్దరు విద్యార్థులు ఒక బాలుడిని ఏ కారణం లేకుండానే ఒక ప్రయోగంలా హత్య చేయటం గురించిన ఐడియాలు అవి...’’ అని రాశారు వర్స్‌లీ. 

అగథా క్రిస్టీ జీవితాన్ని కూడా రహస్యాలు చుట్టు ముట్టాయంటే ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. మొదటి భర్త క్రిస్టీతో తన వివాహ బంధం ఊగిసలాడుతూ ఉన్న సమ యంలో 1926లో ఆమె పది రోజుల పాటు అదృశ్యమై పోయారు. ఆమె కోసం భారీ ఎత్తున గాలింపు జరిగింది  కానీ, ఆమె జాడ తెలియలేదు. ‘‘నమ్మకద్రోహం చేసిన తన భర్తపై ప్రతీకారం తీర్చుకోటానికి ఈ మాయలాడి ఏదో పథకం వేసి ఉంటుంది’’ అని విమర్శకులు కొందరు ఆమె గురించి మాట్లాడినట్లు వర్స్‌లీ రాశారు. 

మహోజ్వలమైన అగథా రచనా జీవితం... ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఆమె తొలి పుస్తకం ‘ద మిస్టీరియస్‌ ఎఫైర్స్‌ ఎట్‌ స్టైల్స్‌’ను ఇద్దరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. ఆ తర్వాత ‘ద బాడ్లీ హెడ్‌’ అనే సంస్థ ప్రచురణకు తీసుకుంది. 36 ఏళ్ల వయసులో అగథా 70 కిలోల బరువు ఉండే వారు. తర్వాత సంవత్సరాలలో ఆ బరువు 82 కిలో లకు చేరుకుంది. ఆమె భారీ మనిషి అనడంలో సందేహం లేదు. అగథాకు నివాస గృహాలంటే ఇష్టం. ఆమెకు ఎనిమిది ఇళ్లు ఉండేవి. 

ఆమె చాలాసార్లు నిర్లక్ష్యపూరితంగా రచన చేసేవారు. వర్సిలీ చెప్పినదాని ప్రకారం... పాయ్‌ రోట్‌ ‘ వైట్‌హెవెన్‌ మాన్షన్స్‌‘లో నివసిస్తాడు, కానీ కొన్నిసార్లు అతను ‘వైట్‌హౌస్‌ మాన్షన్స్‌‘లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ‘స్లీపింగ్‌ మర్డర్‌‘లో, ఒక క్లర్క్, రిసెప్ష నిస్ట్, రైలు ప్రయాణీకుడు... ముగ్గురికీ యాదృచ్ఛికంగా ఒకే పేరు ‘నార్రాకాట్‌’ పెట్టారు. ఈ పేరు మరో మూడు వేర్వేరు పుస్తకాల్లో ఒక చాంబర్‌మేడ్, పడవవాడు, పోలీసు అధికారి పేరుగా కూడా కనిపిస్తుంది.  

1974లో గుండెపోటు వచ్చి కోలుకున్నాక, ఒక సందర్భంలో అగథా క్రిస్టీని ‘‘మీరెలా గుర్తుండిపోవాలని కోరు కుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘డిటెక్టివ్‌ కథలు రాసిన ఒక మంచి రచయిత్రిగా’’ అని ఆమె చెప్పారు. ఆశించినట్టే ఆమె డిటెక్టివ్‌ కథారచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. 

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement