నిబద్ధతే అసలైన కొలబద్ద

Right To Information Commissioner Recruitment Guest Column By Dileep Reddy - Sakshi

సమకాలీనం

పదవీవిరమణ చేసిన అఖిల భారత సర్వీస్‌ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్‌ నియామక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపాల్సిన జోడు గుర్రాలు.

ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వతంత్రులా? అస్వతంత్రులా? స్వతంత్రులైతే... తరచూ న్యాయస్థానాల మందలింపులెందుకు? విప క్షాల విమర్శలేల? సర్కార్లు మారినపుడల్లా సాధింపులెందుకు? అస్వ తంత్రులైతే... ఇంతకీ వారు ఎవరికి కట్టుబడి ఉండాలి, అప్పటి పాల కులకా? ప్రభుత్వ విధానాలకా? రాజ్యాంగ పరిధి చట్టాలకా? ఎందు కిన్ని ప్రశ్నలంటే.. వారి పనితీరు రేకెత్తిస్తున్న సందేహాలే కారణం! నిబంధనలకు నీళ్లొదిలి కొన్ని ప్రభుత్వాలు వారి సేవల్ని దుర్విని యోగం చేస్తున్న వైఖరొక హేతువు! సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను హైకోర్టు మందలించడం, ముంబై నగర పోలీస్‌ కమిషనర్‌ ఆక స్మిక బదిలీ, గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అదనపు బాధ్యతల నుంచి ఆ రాష్ట్ర న్యాయకార్యదర్శిని సుప్రీంకోర్టు తప్పించడం.. ఇటువంటి తాజా పరిణామాలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో అత్యున్నత అధికార వ్యవస్థను నడిపే అఖిల భారత సర్వీస్‌ అధికారులు తరచూ వివా దాలకు, విమర్శలకు కేంద్ర బిందువవుతున్నారు. నిజానికి ఎక్కువ మంది అధికారులు చట్టాలకు, విధానాలకు లోబడి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారయినా, ఉద్యోగవర్గంపై విమర్శలకు కొదువ లేదు. కొన్నిసార్లు పాలకుల చేష్టలు కారణమైతే, మరికొన్నిసార్లు సదరు అధి కారుల వ్యవహారశైలే ఇందుకు దారితీస్తోంది. 

ఫలితంగా ఉన్నతాధికార వ్యవస్థ ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మరేమిటి మార్గం? అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. తాము తలపెట్టిన సంస్కరణలు నెమ్మదించడానికి అధికార వ్యవస్థ మందకొడితనమే కారణమని దేశ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి భిన్నంగా, వయసు మళ్లిన నిపు ణుల్ని పాలనావ్యవస్థలోకి నేరుగా తీసుకోవడం (లేటర్‌ ఎంట్రీ) క్రమంగా ఎక్కువౌతోంది. ఆర్థిక వ్యవస్థ ఛిద్రమై, కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రైవేటీకరణకు వాకిళ్లు తెరుస్తున్న ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్కారు ఎందుకు నడపాలి? అని ప్రశ్నించే ముందు, అందుకు బాధ్యులెవరో శోధించరా?

కడదాకా నిలువని తొలినాళ్ల స్ఫూర్తి
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర అఖిల భారత సర్వీసు అధికారులు అత్యధికుల్లో తొలినాళ్ల ఉత్సాహం, నిబద్ధత తర్వాతి సంవత్సరాల్లో కనబడటం లేదు. పలు రకాల జాడ్యాలకు వారు లోబడిపోతున్నారనే విమర్శలున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో ఎంపిక వల్ల ప్రతిభ, నైపుణ్యం కలిగిన వారే వస్తుంటారు. ఉత్తమ శిక్షణ వల్ల మంచి ఆశయాలతో సర్వీసులో చేరుతారు. ఇటీవలి సంవత్స రాల్లో అయితే... ఐఐటీ, ఐఐఎం తదితర ప్రామాణిక సంస్థల నుంచి పట్టాలు పొందిన వారు అఖిల భారత, రాష్ట్రాల సర్వీసులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మొదట్లో వారు పూర్తి సమయం వెచ్చించి, ఉదాత్తమైన సేవల్ని అందిస్తారు. సంక్షేమమైనా, అభివృద్ది కార్యక్రమా లైనా క్షేత్రంలో మంచి చొరవ, నాయకత్వ స్ఫూర్తితో నిర్వహించి ఆద రణ పొందుతారు. కాలం గడుస్తుంటే పరిస్థితిలో చాలా మార్పు వస్తోంది. అధికారం కేంద్రీకృతమయ్యే రాజకీయ వ్యవస్థ ప్రాపకం కోసం ప్రయాసలో దారి తప్పుతుంటారు. కొన్నిసార్లు రాజకీయ క్రీ(నీ)డల్లో సమిధలవుతారు.

అందుకే తరాలు మారుతున్నా... అధికా రుల మంచితనం మాట్లాడేటప్పుడు ఒక శంకరన్, ఒక వేణుగోపాల్, ఒక నాగిరెడ్డి వంటి కొన్ని పేర్లే ఉదహరించాల్సి వస్తోంది. ‘అధికార వ్యవస్థ–వృద్ధి’ అనే అంశంపై ఓ ప్రపంచ స్థాయి సదస్సులో సమ ర్పించిన పత్రం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న 35 దేశాల్లో ఆర్థికాభివృద్ధికి అధికారుల నైపుణ్యాలే కారణంగా వెల్లడైంది. ‘తూర్పు ఆసియా అద్భుతం’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోనూ జపాన్, కొరియా వంటి దేశాల్లో ఇది సాధ్యమైనట్టు స్పష్టమైంది. మనది సహజంగానే ‘వృద్ధి ప్రతిబంధక’ ఉద్యోగ వ్యవస్థ అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. వీరప్పమొయిలీ నేతృత్వాన 2005లో ఏర్పాట యిన రెండో పాలనా సంస్కరణల కమిషన్‌ సిఫారసుల్లోనూ అత్య ధికం సీనియర్‌ అధికారులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. కానీ, అవేవీ సరైన రీతిలో అమలుకు నోచలేదు. పాలనా సంస్కరణలు కష్టమేమో కానీ, అసాధ్యమేమీ కాదు.

చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పి..
అధికార వ్యవస్థ చెడ్డపేరుకు కారణాలెన్నో! వారి పనుల్లో రాజకీయ అనుచిత జోక్యాలు, నేతల ప్రాపకానికి అధికారులు అర్రులు చాచడం వంటివి ముఖ్యం. మంచి హోదాలు పొందడానికో, ఇష్టమైన చోటుకు బదిలీనో–ఇష్టం లేని చోటు తప్పించుకోవడానికో కొందరు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంతిమంగా వివిధ స్థాయిల్లో జరిగే అవి నీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించే పనులు నాయకులు చెప్పినా... కూడదని నిరాకరించి, అడ్డంగా నోట్‌ఫైల్‌ రాసే అధికారులు ఎందరుంటారు? దేశంలో మధ్యాహ్న భోజన వ్యవస్థకు తమిళనాడులో బీజం పడింది. సదరు ప్రతిపాదన వచ్చినపుడు ఇది ఆచరణ సాధ్యం కాదంటూ ఫైలును ఆర్థికాధికారి తిప్పిపంపారు.

నాటి ముఖ్యమంత్రి ఆ అధికారిని పిలిపించి, ‘ఈ పూట భోజనం ఎక్కడ్నుంచి, ఎవరు పంపితే వచ్చిందో తెలియకుండా.. తదుపరి పూట భోజనం అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా?’ అని అడిగారట. ‘లేదు’ అని చెప్పిన అధికారికి, ‘నేనా పరిస్థితి ఎదు ర్కొన్నాను. రాష్ట్రంలో ఎందరో అలాంటి వారున్నారు. సంక్షేమ రాజ్యంగా వారిని ఆదుకోవడం మన బాధ్యత, ఎలా సాధ్యమో నే చూసుకుంటాను, నీ అభిప్రాయాన్ని ఓవర్‌రూల్‌ చేస్తూ నోట్‌ రాస్తున్నాలే!’ అని సౌమ్యంగా చెప్పి పంపారట. ఆయన ఎవరో కాదు, దివంగత ఎమ్జీ రామచంద్రన్‌. రాజకీయ వ్యవస్థకు లొంగి చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పటమే కాదు, కోర్టు ఉత్తర్వుల్నీ అమలు చేయని అధికారులుంటారు. అది న్యాయ ధిక్కారం కేసు అయినపుడు కోర్టుల నుంచి చీవాట్లు. ‘ఈ పద్ధతేం బాగోలేదు. కోర్టు ఆదేశాలు అమలు చేయరు. చివరి నిమిషం దాకా ఎలా భంగపరచాలని చూస్తారు. తప్పనపుడు... బేషరతుగా క్షమాపణలు అడుగుతారు’ అని తెలంగాణ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంగారెడ్డి జిల్లా అధికారుల్ని మందలించింది.

పరస్పర లబ్ధికి లొంగుబాట్లు..
విభేదించినప్పటి కన్నా, నేతలతో అధికారులు అంటకాగటం వల్ల ఉద్యోగ వ్యవస్థ భ్రష్టుపట్టిందే ఎక్కువ! అలా అని అన్నింటికీ అధికా రులు నేతల్ని విభేదించాలని ఎవరూ అనరు. పాలకులకు అనుచిత ప్రయోజనాలు కల్పించినందుకు ఉద్యోగ విరమణ తర్వాత మంచి హోదాలు పొందిన వారుంటారు. వాటిపై కన్నేసి... రాజ్యాంగానికి, చట్టానికీ అతీతంగా ఉద్యోగం చివరి రోజుల్లో రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసిన అధికారులూ ఉన్నారు. అందుకే, వివిధ కమిషన్లు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లోకి పదవీ విరమణ తర్వాత అధికారులు రావడాన్ని పౌరసమాజం తరచూ విమర్శిస్తోంది. యోగ్యులు, వివాద రహితులైన తటస్థ అధికారులు రావటాన్ని స్వాగతించిన సందర్భాలెన్నో! యోగ్యత లేకుండా జరిగే అడ్డదిడ్డపు నియామకాలను కోర్టులూ తప్పుపట్టాయి. పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీస్‌ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది.

అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నది ముఖ్య విమర్శ. అధికారులు సమాచారం సరిగా ఇవ్వనందుకే, సర్వీసు నిబంధనల్ని ఉన్నతాధికారులుగా ఉల్లంఘించినందుకే... అప్పీళ్లు వచ్చే ఆర్టీఐ కమిషన్లలో, పాలనా ట్రిబ్యునళ్లలో తిరిగి రిటైర్డ్‌ అధికారులే తీర్పులు చెప్పడమేమిటి? అన్నది సగటు మనిషి విస్మయం. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్‌ నియా మక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపా ల్సిన జోడు గుర్రాలు.

- దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top