కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’

 Ranganayakamma Sakshi Guest Column On Government Intervention In Education

విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్నజీవులని చెప్పరు.

కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో ఎప్పుడు, ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి.

సెంట్రల్‌ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్‌ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది – దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్‌ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్‌లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా.
కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యం ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యం లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్థుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన!

విద్యలో ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ  జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ – రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్ల మీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్‌’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్ధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ,మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు
సంబంధించిన అంశాలు కావు.

ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళకిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకంలో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోధ్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే – మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుద్ధ్యాలు ఉంటాయి.

వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారంలోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ చిత్రించేటప్పుడు ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు.

ఆ రాజులే స్వయంగా దోపిడీదారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల
గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు).

చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పథంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి!

రంగనాయకమ్మ
వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top