జానపద గాథల్లో... సమ్మక్క | Sakshi
Sakshi News home page

జానపద గాథల్లో... సమ్మక్క

Published Wed, Feb 21 2024 5:56 AM

medaram sammakka sarakka jatara  - Sakshi

ఇంతింతై వటుడింతౖయె...  
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జన జాతరగా ప్రసిద్ధిగాంచిన ‘మేడారం సమ్మక్క జాతర’కు కారకులైన గిరిజన వీరవనితలు సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మల పుట్టుపూర్వోత్తరాల గురించి అందుబాటులో గల ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రునితో జరిగిన పోరాటంలో కుట్రతో ఒక సైనికుడు దొంగ చాటుగా బల్లెంతో చేసిన దాడిలో సమ్మక్క క్షతగాత్రురాలై చిలకలగుట్ట వద్ద అదృశ్యమైనట్టు జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథల ద్వారా తెలుస్తోంది. 

కానీ కాకతీయ రాజ్య చరిత్రలో మేడారం పోరాటం, సమ్మక్క– పగిడిద్దరాజుల సామంత రాజ్యం గురించిన ప్రస్తావన లేదు. గిరిజనుల ఆశ్రిత కులం వారు డోలీలు. వీరు ‘పడిగె’ అనే త్రికోణాకార గుడ్డపటం సాయంతో గిరిజన పూర్వీకుల చరిత్ర, వీర గాథలను ‘డోలి’ వాయిస్తూ గానం చేస్తారు. మణుగూరు ప్రాంతంలోని గూడెంకు చెందిన డోలి కళాకారుడు ‘సకిన రామచంద్రయ్య’ చెప్పే పడిగె కథ ప్రకారం: పేరంబోయిన కోయ రాజు వంశానికి చెందిన ఆరవ గట్టు సాంబశివ రాజు– తూలు ముత్తి దంపతులకు ఐదుగురు సంతానం – సమ్మక్క పెద్దకూతురు. ఆమెకు యుక్త వయస్సు రావడంతో బస్తరు ప్రాంతానికి వెళ్లి పగిడిద్ద రాజును చూసి ఆయనతో పెళ్లి చేయ నిశ్చయించాడు తండ్రి. మేడారం దగ్గరి

కామారం గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు మైపతి అరుణ్‌ కుమార్‌ తన క్షేత్ర పర్య టనలు, పూర్వీకుల మౌఖిక కథల ద్వారా సేకరించిన సమా చారం ప్రకారం... కోయత్తూర్‌ సమాజంలోని ఐదవ గట్టు ‘రాయి బండని రాజు’ వంశానికి చెందిన ఆడబిడ్డ సమ్మక్క ‘చందా‘ ఇంటి పేరు గల రాయి బండాని రాజుకు ఇద్దరు భార్యలు. ఆ రాజుకు వెదురు పొదల వద్ద ముద్దులొలికే పసిపాప కని పిస్తుంది, ఆ పాపను ఇంటికి తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఈ రాజుకు నాగు లమ్మ అనే మరో కుమార్తె జన్మించింది. కోయ వారి సంప్రదాయం ప్రకారం తొలిసూరి బిడ్డను ఇంటి వేల్పుగా కొలుస్తారు.

అందుకే సమ్మక్క చందా వారి ఇలవేల్పు అయ్యింది. ఈ రెండు కథనాల్లోనూ పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహాన్ని ఆమె తండ్రి కుదుర్చుతాడు. అయితే నాట కీయ పరిణామాల మధ్య సమ్మక్క, నాగులమ్మలను ఇద్దరినీ పగిడిద్దరాజు వివాహం చేసుకుంటాడు. స్వాతంత్య్రానికి పూర్వం నైజాం రాజ్యంలో చందా, సిద్ధబోయిన ఇంటిపేర్లున్న గిరిజన కుటుంబాలు మాత్రమే చేసుకునే చిన్న జాతర ఇది. ప్రతి ఏటా జాతర చేసే స్థోమత లేక రెండే ళ్లకోమారు అది కూడా చందాలు వేసుకునీ, అవీ చాలక వరంగల్‌లోని వర్తకులు దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి ఈ జాతర నిర్వహించేవారు. 1961లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. 1996లో ‘రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించింది. పాలకులు, భక్తుల కృషితో నేడు ఉన్న స్థితికి ఈ జాతర చేరింది. –  డా‘‘ అమ్మిన శ్రీనివాసరాజు, పరిశోధక రచయిత (నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు మేడారం జాతర)

కుంకుమ భరిణ రూపంలో...  
సమ్మక్క ఓ కోయరాజు కుమార్తెగా జానపద కథలు చెబు తున్నాయి. ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో తమ వారంతా మరణించడంతో సమ్మక్క వీరావేశంతో శత్రు మూకలను సంహరించింది. కానీ ఒక సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడవడంతో రక్తపు టేరుల మధ్య అడవి వైపు వెళ్తూ అదృశ్యమయ్యింది. గిరిజనులు ఆమె కోసం వెదుకు తుండగా చిలకల గుట్టపై నెమలినార చెట్టుకింద కుంకుమ భరిణ కనిపించింది. తన శక్తియుక్తులనూ, ధైర్యసాహసాలనూ సమ్మక్క ఆ భరిణలో నిలిపిందని భావించి ఆమె ప్రతి రూపంగా భావించారు గిరిజనులు.

అక్కడే గద్దెలను నిర్మించి అప్పటినుండి సమ్మక్క సారలమ్మ జాతర జరి పించ సాగారు.మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులు  ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగు తుంది. మొదటిరోజు కన్నెపల్లి నుండి సారలమ్మకు ప్రతి రూప మైన పసుపు భరిణను మేళ తాళాలతో తీసుకువచ్చి వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు. రెండవ రోజు సమ్మక్కకు ప్రతిరూపంగా భావించే కుంకు మభరిణను చిలకల గుట్టనుండి తీసుకువచ్చి  వెదురుకర్రకు అలంకరిస్తారు. 

రెండు గద్దెలపై రెండు వెదురు కర్రలను సమ్మక్క, సారలమ్మలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు ‘వనదేవతలు’గా  భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు నివేదిస్తారు. జంపన్న వాగులో స్నానం చేసి, తలనీలాలు సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. నాలుగవ రోజు సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. – అయిత అనిత, రచయిత్రి 

Advertisement
Advertisement