మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారు?

Justice Chandra Kumar Guest Column On Religious Hatred - Sakshi

సందర్భం

ఈ రోజు మీడియాలో బైబిల్‌ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? రెండు కొండల పార్టీకి ఓటేస్తారా?– ఏడుకొండల బీజేపీకి ఓటేస్తరా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నట్లు వార్త వచ్చింది. ఇదే నిజ మైతే ఇది కచ్చితంగా రాజ్యాంగా నికి, చట్టానికి వ్యతిరేకం. అంతే కాదు, భారత శిక్షాస్మృతి ప్రకారం జైలుశిక్ష విధించగల నేరం.
ఈ వ్యాఖ్యలు మత విద్వేషాన్ని రెచ్చగొడ్తాయి. ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తాయి. బైబిల్‌ చదివేవారిని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఐపీసీ 153 (ఎ) ప్రకారం విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలను పెంచడం నేరం. ఈ నేరాలకు 3 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. లేదా ఫైన్‌ విధించవచ్చు. లేదా శిక్ష, ఫైన్‌ రెండూ విధించవచ్చు. అంతేగాదు పూజా స్థలాలలో వైష మ్యాలను పెంచే చర్యలు చేసినట్లయితే ఈ శిక్ష 5 సంవ త్సరాల వరకు విధించవచ్చు. ఇది పోలీసులే బెయిల్‌ ఇవ్వ గూడని నేరం. పోలీసులు తప్పనిసరిగా కేసు పెట్టాల్సిన నేరం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం న్యాయకోవిదుల అభిప్రాయం తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. చట్ట బద్ధంగా ఇచ్చిన ఆజ్ఞను (ఆర్డరును) ఉల్లంఘించినా నేరమే.

ఇక ప్రజా ప్రతినిధుల చట్టం 1951లో 125 సెక్షన్‌ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ ఎన్నికకు సంబంధించి అయినా సరే.. మతాల, జాతుల, కులాల, భాషల మధ్య వైషమ్యాలను కల్గించి, వాటి మధ్య శత్రుత్వాన్ని ద్వేషభావాన్ని పెంపొందించినట్లయితే అతనికి 3 సంవ త్సరాల వరకు శిక్ష లేదా ఫైన్‌ లేదా రెండింటిని విధిం చవచ్చు. ఎవరైనా సెక్షన్‌ 125 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే వారు సెక్షన్‌ 8 ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయ డానికి అనర్హులు. అదేవిధంగా మత సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం 1988 ప్రకారం, ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోతారు.

బండి సంజయ్‌ స్టేట్‌మెంట్‌ను బీజేపీ ఖండించాలి. లేకపోతే ఎన్నికల కమిషన్‌ తీసుకునే చర్యకు గురికావలసి వస్తుంది. గౌరవనీయులు జస్టిస్‌ ఆవుల సాంబశివరావు భారత రాజ్యాంగ వ్యవస్థ న్యాయవ్యవస్థ అనే పుస్తకంలోని లౌకిక తత్వం అనే వ్యాసంలో ఇలా వ్రాశారు.‘లౌకికత్వాన్ని ప్రతి పౌరుడు, ముఖ్యంగా ముందు కాలంలో దేశాన్ని నడిపించవలసిన యువతరం, వంట బట్టించుకోవడం అవసరం. అది లేకపోవడంతో భారత ఉపఖండం ముక్కచెక్కలయ్యింది. ఆ శకలాలలో  నివసించే ప్రజలు మత పిచ్చితో,  శ్లేష్మంలోని ఈగల్లాగా కొట్టు మిట్టాడుతున్నారు. దేశాన్ని ముక్కలుగా తరిగిన 1947 నాటికంటే ఇప్పుడు ఆ పిచ్చి ఏ మాత్రం తక్కువగా లేదు.

హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రిస్టియన్లు – ఎవరికి వారు తమ మతం, తమ సమాజం, తమ ఉనికి ప్రమాదంలో పడిపోయిందని ఆరాటపడిపోతున్నారు. ఒకళ్ళమీద మరొకరు అనుమానాలు, కక్షలు పెంచుకుంటు న్నారు. ఈ మతపిచ్చి మన ఉపఖండంలోని మూడు రాజ్యా లకే పరిమితం కాలేదు. మధ్య తూర్పు ఆసియా దేశాల్లో ఈ వెర్రి ఏ మాత్రం తక్కువగా లేదు. తమ రాజ్యాలనే మత రాజ్యాలుగా మార్చివేస్తున్నారు. ప్రజల జీవితాన్ని తారు మారు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కాక, ప్రజల్ని పేదరికం నుండి బయట పడవేసే ప్రయత్నాలు కాక, మత స్పర్థల్ని పెంచే తంత్రాల మీదనే ప్రభుత్వాల ప్రయత్నాలు కేంద్రీకృతమైనాయి.

వెర్రితలలు ఇంతటితో ఆపలేదు. మత పిచ్చి మాత్రమే చాలదన్నట్లు, కులతత్వాన్ని, రెచ్చగొడుతున్నారు. సమాజం యావత్తు కులాల కింద ముక్కచెక్కలై పోతున్నది’. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం పౌరులందరికీ మత స్వాతంత్య్రపు హక్కు కల్పించారు. మనదేశంలోని ఏ వ్యక్తి అయినా తన సొంత ఆలోచన విధానాన్ని పాటించవచ్చు. తనకిష్టమొచ్చిన మతాన్ని పాటించి ఆచరించి ప్రచారం చేసుకోవచ్చు. ఏ మత వ్యవస్థలైనా, మత సంస్థలను ఏర్పాటు చేసికొని మత విషయాలను తాము సొంతంగా నడుపుకోవచ్చు. ఆస్తు లను సంపాదించుకోవచ్చు. ఏ వ్యక్తినీ కూడా మతపరమైన సంస్థలకు ఖర్చుపెట్టడం కోసం పన్ను చెల్లించమని నిర్బంధించకూడదు. ప్రభుత్వ సహాయంతో నడిచే ఏ విద్యాసంస్థలోనైనా మతపరమైన బోధనలు చేయరాదు. ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థలలో మతం కారణంగా ప్రవేశం నిరాకరించరాదు. ప్రతి వ్యక్తికి అతనికి ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి ఉంటే వాటిని సంరక్షించుకునే అధికారం ఉంటుంది. అల్ప సంఖ్యాక వర్గాల వారు వారి సొంత విద్యాసంస్థలను నెల కొల్పి వాటిని సొంతంగా నడుపుకోవచ్చు. దీనినే లౌకిక వాదం అంటారు. రాజ్యాంగంలోని 25 నుంచి 30 అధికర ణలు ఈ విషయాలను స్పష్టం చేస్తాయి,

ప్రతివ్యక్తి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని రాజ్యాం గంలోని ప్రాథమిక విధులలో పేర్కొన్నారు. ఏ మనిషి ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో అతని లేదా ఆమె చేతిలో ఉండదు. పంచభూతాలు సూర్యుడు, గాలి, నీరు, వాయువు, భూమి ఎవ్వరిపట్ల వివక్షత చూపవు. అంటే ప్రకృతికి అంటే పరమాత్మునికి వివక్ష ఉండదు. పరమా త్మకు ఏ కులాన్ని, ఏ మతాన్ని ఆపాదించగూడదు. ఏ పేరుతో ప్రార్థించినా చేరేది అక్కడికే. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో అన్ని మతాల వారిని, కులాలవారిని సృష్టించాడు. దీనిని అర్థం చేసుకోక స్వార్థంతో, రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి వాడుకోవడం చట్టరీత్యా నేరం. దైవం దృష్టిలో అపచారం.

నేడు ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల మీద దాడులలో విగ్రహాలు ధ్వంసం చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాత్ర లేదా ఆయన పార్టీ హస్తం ఉంటుందని నేను అను కోవడం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు. తనే స్వయంగా తన ప్రభుత్వానికి అస్థిరతను ఎందుకు కల్పిస్తారు? ఎందుకు అశాంతిని, శాంతిభద్రతల సమస్య లను కలుగజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.

-జస్టిస్‌ చంద్రకుమార్‌ 
వ్యాసకర్త రిటైర్డ్‌ న్యాయమూర్తి
మొబైల్‌ : 79974 84866

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top