Journalist Bhandaru Srinivas Rao: ఆ రోజు నవ్వులే నవ్వులు!

Journalist Bhandaru Srinivas Rao About YS Rajasekhara Reddy - Sakshi

సందర్భం

ఎప్పుడో పుష్కరకాలం క్రితం ముఖ్యమంత్రి దివంగత రాజ శేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్య క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వ ర్యంలో హెచ్‌ఎంఆర్‌ఐ రూప కల్పన చేసిన 104 కాల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి సీఎం రాజశేఖర రెడ్డి వచ్చారు.

ముందుగా అసలు ఏమిటీ కాల్‌ సెంటర్‌ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా ఉంటుంది. ఎక్కడో మారుమూల ఉండే పల్లెలతో పాటు పట్టణవాసులకు సైతం 24 గంటలూ వైద్య సలహాలు, సేవలూ అందించడానికి ఏర్పాటు చేసిందే ఈ కాల్‌ సెంటర్‌. జనానికి అనేక ఆరోగ్య సమస్యలు ఎప్పుడు పడితే అప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అటు వంటి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉంటే సరే... లేకపోతే పరిస్థితి ఎంత ఆందోళన కరంగా ఉంటుందో చాలామందికి అనుభవమే. ఈ ఆందోళనను దూరంచేయడానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అత్యవసర వైద్యసేవలకోసం సంప్రదించ డానికి ఒక టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. అదే 104.  

రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నంబరుకు ఉచితంగా ఫోన్‌ చేయవచ్చు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూ టర్లలో నిక్షిప్తం చేసి కాల్‌ సెంటర్‌లో ఉంచుతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్స్‌రే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లు... ఇలా అన్ని వివరాలూ సిద్ధంగా ఉండటం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడి గినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ; ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ; ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా కోతలు ఉన్నదీ... వంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. 

మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం ఉన్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసు కుని ఒక నంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కాల్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ తెరపై సిద్ధంగా ఉంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుం టుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటి కప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు.

మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియ పరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108కి తెలియపరచి అంబులెన్స్‌ పంపిస్తారు. స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు. ఇక అసలు విషయం చెప్పుకుందాం. ముఖ్య  మంత్రి రాజేఖరరెడ్డి ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నంబరుకు స్వయంగా ఫోన్‌ చేశారు. అవ తల నుంచి కాల్‌ సెంటర్‌ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది. ‘‘104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?’’

ముందు కంగు తిన్న ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు. సీఎం తన పేరు చెప్పగానే, కాల్‌ సెంటర్‌ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది. ‘ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?’
వైఎస్‌ ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వు లతో నిండిపోయింది.

భండారు శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
(జూలై 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top