‘బలి పశువు’ కొలువుగా మారిందెందుకు?

Gatika Vijayakumar Article On Police Martyrs Remembrance Day - Sakshi

సందర్భం 

‘అంకురం’ సినిమాలో నక్సలైట్లకు సహకరిస్తున్నారనే నెపంతో రేవతి ఇంటిని పోలీసులు అర్ధరాత్రి కూల్చేస్తారు. తెల్లారి పరామర్శకు వచ్చిన వారు ‘ఇది చాలా అన్యాయం, మనం వెంటనే వెళ్లి పోలీసు రిపోర్టు ఇవ్వాలి’ అని సలహా ఇస్తారు. ఈ మాట విన్న తర్వాత రేవతి, ఆమె తండ్రి పగలబడి నవ్వుతారు. నిస్సహాయత, నిర్వేదం నిండుకున్న ఆ నవ్వులో 1980–90 దశకాల్లో తెలంగాణ జిల్లాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న ఏవగింపు ప్రస్ఫుటిస్తుంది.

‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రధారి మరొకరితో రిక్షాలో వెళుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే అవకాశాల గురించి చర్చిస్తుంటాడు. అది వింటున్న రిక్షా కార్మికుడు ‘సొతంత్రం వస్తే మన ఊరి హెడ్డు (పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌) మారుతాడాండీ’ అని ఆశగా అడుగుతాడు. పోలీసుల నుంచి విముక్తి అయితే చాలు, ఆ రిక్షా కార్మికుడికి స్వాతంత్య్రం వచ్చినట్లే. సిని మాలు, నాటకాలు, పాటలు ఆయా కాలాల్లో నెలకొన్న సామాజిక స్థితికి అద్దం పడతాయి. బ్రిటిష్‌ ఏలుబడిలో ఉన్నా, నిజాం కాలంలో అయినా, సమైక్య పాలన అయినా పోలీసులే ప్రజలకు ప్రధాన విరోధులుగా కనిపించేవారు.

నిజానికి ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు గుర్తొచ్చేది పోలీసులే. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించేది సైనికులతో పాటు పోలీసులే. ఇంత కష్టంతో కూడుకున్న పని చేస్తున్న పోలీసులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావాలి. సైని కుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో, వారికంటే తక్కువ వేతనాలు, సౌకర్యాలు పొందుతూ ఎక్కువ సేవలు అందిస్తున్న పోలీసుల గురించి అంతకన్నా గొప్పగా మాట్లాడుకోవాలి కదా? కానీ ఆ పరిస్థితి ఉందా? 

ఆయా కాలాల్లో ప్రభుత్వాలు అనుసరించిన విధానం, పాలకుల వైఖరి కారణంగా పోలీసులు బలిపశువులు కావాల్సి వచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే ప్రజ లను అణచివేయడమే పోలీసుల ప్రాథమిక విధి కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నేరాలను అదుపు చేయడం, నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, సమాజంలో శాంతి–ప్రజలకు భద్రత కల్పించడం లాంటి ప్రాథమిక విధులు పోలీసులకు ద్వితీయ, తృతీయ ప్రాధాన్యాలుగా మారడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరిస్తే ఇంత హింస –ప్రతిహింస జరిగేవి కావు. ప్రతీ దాన్ని శాంతిభద్రతల సమస్యగా చూడటంవల్ల ఈ దుఃఖం మిగిలింది. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించి, పని చేయగలిగిన చోట పరిస్థితి మారుతున్నది. పోలీసుల బలిదానాలు తగ్గాయి.

ఆరేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రమే దీనికి పెద్ద ఉదాహరణ. సామాజిక అసమానతలు తొలగించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, పేదరికాన్ని పారద్రోలడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం లాంటి అంశాల్లో ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తే సమాజంలో శాంతి, సామరస్యం అంత వర్ధిల్లుతాయి. పోలీసు నిర్బంధంగా పేరుబడ్డ ప్రభుత్వ నిర్బంధాన్ని స్వయంగా చవిచూసిన ఉద్యమకారుడు కావడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తున్నారు. శాంతియుతంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రమే కండ్లముందు ఉండడంతో ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరించుకోవచ్చనే మానసిక దృఢత్వం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. సమస్యల పరిష్కారానికి ప్రాణాలు పణంగా పెట్టే ఉద్యమాలు అవసరం లేదనే దృక్పథం ఏర్పడింది.

1985లో పీపుల్స్‌ వార్‌ అగ్రనాయకుడు కొండపల్లి సీతారామయ్యను ఉస్మానియా ఆసుపత్రి నుంచి తీసుకుపోవడానికి భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ మహ్మద్‌ ఇబ్రహీంను నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పటి నుంచి 2014లో తెలంగాణ ఆవిర్భావం వరకు సమైక్య రాష్ట్రంలో మొత్తం 557 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాశారు. అందులో తెలంగాణ వారు 325 మంది. ఏడాదికి సగటున 20 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఒక్కరంటే ఒక్క పోలీసు కానిస్టేబుల్‌ మాత్రమే నక్సలైట్ల చేతిలో హతమవడం మారిన పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం, విధానపర సౌలభ్యం కారణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సాధ్యమవుతున్నది. దీంతో ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న పాత వైఖరి మారి సదభిప్రాయం రూపుదిద్దుకుంటున్నది. పోలీసులున్నది మన కోసమే అని ప్రజలు భావించినప్పుడు వారి బలిదానాలకు నిజంగానే గొప్ప నివాళి, సానుభూతి లభిస్తుంది. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రంలో తొలి అడుగులు పటిష్టంగా పడ్డాయి.
(నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా) 


గటిక విజయ్‌కుమార్‌

వ్యాసకర్త కేసీఆర్‌ వ్యక్తిగత పౌర సంబంధాల అధికారి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top