అబద్ధం లాంటి నిజం... నిజమైన అబద్ధం

CNS Yazulu Column About Truth And Lie in Telugu - Sakshi

నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా మహారాజా? అంటాడు ‘పాతాళభైరవి’లో తోటరాముడు.
ఎందుకలా అడగాలి? నిజమే చెప్పచ్చు కదా? అబద్ధం కూడా ఓ ఆప్షన్‌ ఎందుకయ్యింది? ఎందుకంటే ఎక్కువ మంది కోరుకునేది అబద్ధం కావచ్చు. లేదా ఎక్కువ మంది చెప్పేవి అబద్ధాలు కావచ్చు. 

బుజ్జాయిలను ఊరడించడానికి అమ్మలు అందమైన అబద్ధం ఆడతారు. ‘చందమామ రావే...జాబిల్లి రావే.. కొండెక్కి రావే..గోగుపూలు తేవే‘ అని పాడతారు. నిజానికి చందమామ రానూ రాదు... గోగుపూలు తేనూ తేదు. 

చాలా సందర్భాల్లో అబద్ధాన్ని ప్రమోట్‌ చేసినంతగా నిజాన్ని ప్రమోట్‌ చేసినట్లు కనిపించదు. ‘వంద అబద్ధాలు ఆడినా సరే ఓ పెళ్లి చేయాల’న్నారు పెద్దలు. అంటే వైవాహిక జీవితం అలా కొన్ని అబద్ధాలతో మొదలవుతుందన్నమాట. అంతేకాదు ‘అబద్ధం ఆడితే గోడకట్టినట్లు ఉండాలి’ అంటారు. అంటే అబద్ధాన్ని ప్రమోట్‌ చేయడమేగా?

‘నిజం నిప్పు లాంటిది... దాన్ని దాచాలంటే దాగదు’ అంటారు. అది నిజంగా నిజం కాదు. పచ్చి అబద్ధం. బహుశా నిజం నిప్పులాంటిది అయితే అయి ఉండచ్చు. కాకపోతే అది నిజం చెప్పినవాళ్లనే అది కాల్చేస్తుంది.

దానికి ఇటలీకి చెందిన బ్రూనో మరణమే తిరుగులేని నిదర్శనం. 16వ శతాబ్ధంలో పుట్టిన బ్రూనో ఖగోళ శాస్త్రజ్ఞుడు. భూమిని పోలిన గ్రహాలు... వాటి చుట్టూ తిరిగే ఉప గ్రహాలూ చాలా ఉన్నాయని లోకానికి చాటాడు. అంతే... నాటి మతపెద్దలు అది దైవద్రోహం అన్నారు. చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. బ్రూనో ఒప్పుకోలేదు. అంతా కలిసి బ్రూనోని సజీవదహనం చేశారు. బహుశా దీన్ని చూసిన తర్వాతే నిజం నిప్పులాంటిదని ఎవరికైనా తోచి ఉండచ్చు. 

‘అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను’ అని మన న్యాయస్థానాల్లో పవిత్ర గ్రంథాల సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉంటారు. అలా ప్రమాణం చేసిన వాళ్లంతా నిజాలే చెబితే కోర్టుల్లో అసలు కేసులే ఉండకూడదు. వాళ్లు ఏం చెబుతున్నారో అందరికీ తెలుసు. కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవతకూ తెలుసు.

మహాభారత యుద్ధంలో కౌరవుల ఆర్మీ కమాండర్‌గా ఉన్న ద్రోణాచార్యుడు తిరుగులేని యోధుడు. అతను ఉన్నంత సేపూ కౌరవులను ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికీ తెలుసు. అందుకే ద్రోణాచార్యుని ఓ అబద్ధంతో తప్పించాలని కృష్ణుడు ప్లాన్‌ చేశాడు. ఎప్పుడూ అబద్ధం ఆడని ధర్మరాజును పిలిచి చెవిలో ఓ ఉపాయం చెప్పాడు.  ఆ వెంటనే అంతటి ధర్మరాజూ మరో ఆలోచన లేకుండా ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా అని... టోన్‌ డౌన్‌ చేసి ‘కుంజరః’ అన్నాడు. అంటే అబద్ధం ఆడకుండా, నిజం చెప్పకుండా ద్రోణుణ్ణి దెబ్బతీశాడన్నమాట. 

నిజం దాచిపెట్టడం కూడా అబద్ధమే కాబట్టి ధర్మరాజు ఎలాంటి మొహమాటాలూ లేకుండా అబద్ధం ఆడాడని మహాభారతమే చాటి చెప్పింది. ‘ఏం నిజాలే ఎందుకు చెప్పాలి? అవసరం పడితే అబద్ధం ఆడమని కృష్ణపరమాత్ముడే చెప్పాడు కదా నువ్వు ఆయన కన్నా గొప్పోడివేటి?’ అని ఎవరైనా లాజిక్‌ లాగితే... ఎవరి దగ్గరా సమాధానం ఉండదు.

సూర్యుడు ఏడు గుర్రాల రథంపై తిరుగుతూ ఉంటాడని నమ్మకం. ఖగోళశాస్త్రంలో పరిశోధనలు మొదలు కానంత వరకు అందరూ అదే నిజం అనుకున్నారు. కానీ గ్రహాల గురించి చదువుకున్నాక.. సూర్యుడు రథంపై తిరగడం లేదని.. ఆ మాటకొస్తే సూర్యుడు సౌర వ్యవస్థ మధ్యలో మఠం వేసుకుని కూర్చుంటే... ఆయన చుట్టూరా భూమి వంటి గ్రహాలు తిరుగుతున్నాయని తేలిన తర్వాత కూడా ఏడు గుర్రాలపై సూర్యుడు తిరుగుతాడని నమ్మేవాళ్లు ఉన్నారంటే... అందమైన అబద్ధం యొక్క గొప్పతనం అది.

ఈ నిజాన్ని మొట్టమొదట కనిపెట్టింది కోపర్నికస్‌. ఆ తర్వాత గెలీలియో మరింత లోతుగా పరిశోధనలు చేసి ‘నాయనలారా... మనం ఇప్పటి వరకు అనుకుంటున్నట్లు సూర్యుడు ఎటూ తిరగడం లేదురా బాబూ. సూర్యుడి చుట్టూరా భూమి తిరుగుతోంటే... మనం ఖాళీగా ఉండడం ఎందుకని చంద్రుడు మన భూమి చుట్టూరా తిరుగుతున్నాడురా నాయనలారా’ అని  చెప్పాడు. అంతే... ‘నువ్వు దైవదూషణకు పాల్పడుతున్నావ’ని మతపెద్దలు మండిపడ్డారు. ఎంత బెదిరించినా గెలీలియో తాను చెప్పిందే నిజమన్నాడు. దాంతో పాలకులు గెలీలియోని జీవితాంతం గృహనిర్బంధంలో పెట్టారు. నిజం చెప్పినందుకు దొరికిన బహుమానం అది.

నిజాన్ని ప్రమోట్‌ చేయడానికి సత్యహరిశ్చంద్రుడి జీవితాన్ని చూపిస్తారు. ఎన్ని కష్టాలెదురైనా నిజానికే కట్టుబడి ఉండాలన్న హరిశ్చంద్రుని గొప్పతనాన్ని కొనియాడుతూ అందరూ నిజాలే చెప్పాలని సూచిస్తారు.

హరిశ్చంద్రుని జీవితకథను చదివిన వారికి ఏమనిపిస్తుంది? నిజాలు చెబితే జీవితాంతం హరిశ్చంద్రుడిలా ఇలా కష్టాలు అనుభవించాలన్నమాట. దీని బదులు అబద్ధం చెప్పేసి హాయిగా ఉండచ్చు కదా అన్న కొంటె ఆలోచన వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

నిజాలు చెప్పాలి. నిజమే. కానీ కొందరు అబద్ధాలు ఆడేస్తూ... కొందరే నిజాలు చెబితే రెంటి మధ్య ఘర్షణ వస్తుంది. 

ఎవరో ఎందుకు మహాసాధ్వి సీతమ్మ ఏం చేసింది? ‘అలో లక్ష్మణా’ అంటూ రాముడిలా రాక్షసుడు అరవగానే అంతటి దశరథుని కోడలూ అమాయకంగా నమ్మేసి ‘లక్ష్మణా... మీ అన్న కష్టాల్లో ఉన్నాడు వెళ్లి కాపాడు’ అనేసింది. ‘వదినమ్మా... అది రాముడి గొంతు కాదు ఏదో మాయ’ అన్నా సరే సీతమ్మ వినలేదు. 

అది అబద్ధమని లక్ష్మణుడికి తెలిసినపుడు సీతమ్మకు ఎందుకు తెలియలేదు? అంటే అబద్ధానికి ఉన్న పవర్‌ అది అని అర్థం చేసుకోవాలి.
ఇటలీకి చెందిన నావికుడు కొలంబస్‌ అబద్ధంతో జీవితం గడిపేశాడు. రాణి ఇసాబెల్లా, రాజు ఫెర్డినాండ్‌ల ఆర్థికసాయంతో నావికా యాత్ర చేసిన కొలంబస్‌ అమెరికా తీరాన్ని చూసి భారత్‌ అనుకున్నాడు.

తాను భారత్‌ను కనుగొన్నానని రాణిని నమ్మించాడు. అయితే అది భారత్‌ కాదని తర్వాత తేలింది. అప్పటికీ కొలంబస్‌ తాను ఆర్థిక సాయం పొందిన రాణికి నిజం చెప్పలేదు. కొలంబస్‌ అబద్ధం చెప్పాడని తెలిసిన తర్వాత రాజదంపతులు కొలంబస్‌ను క్షమించి వదిలేశారు.

నిజం చెప్పిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేసే సమాజం... అబద్దం చెప్పిన వాళ్లకు ప్రాణభిక్ష పెట్టి ప్రోత్సహించిందన్నమాట. 
బహుశా ఇవి చూసిన తర్వాతే తోటరాముడికి ‘నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?’ అన్న డైలమా వచ్చి ఉంటుంది.

– సి.ఎన్‌.ఎస్‌. యాజులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top