కొత్త సంవత్సరంలో... జీఎస్టీ మోత

Changes in GST Law that will Come into Effect From 1st January - Sakshi

సందర్భం

నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)  రూపంలో మోయ లేని భారం మోపనుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు... చేనేత, జౌళి, పాదరక్షల రంగాలపై కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పన్నులు వేయలేదు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. కంచి, బెనారస్, బెంగాల్, పోచంపల్లి, గద్వాల్, నారా యణపేట, వెంకటగిరి, ధర్మవరం లాంటి పట్టు, కాటన్‌ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇకపై ఆన్‌లైన్, ఈ–కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా; ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్‌ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్‌ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్‌ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే.

జీఎస్టీ కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం...  పన్నుల పెంపు, హేతుబద్ధత, వ్యత్యాసాల తొలగింపు నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకనుంచీ పన్నుల రీఫండ్‌ మార్పుల కోసం ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. వరసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు చేయకపోతే..  మూడో నెల బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచుతారు. అంటే నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జీఎస్టీ దాఖలు చేయకపోతే జనవరిలో బ్లాక్‌లిస్ట్‌లోకి  వెళతారు. ఎలాంటి షోకాజ్‌ నోటీసు లేకుండా స్థిర, చర ఆస్తులు జప్తు చేసే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు దఖలు పరిచారు. తనకు కావాల్సిన సమాచారం ఏ వ్యక్తి, సంస్థ నుంచైనా రాబట్టే అధికారం జీఎస్టీ కమిషనర్‌కు ఉంటుంది. ఈ జప్తుకు సంబంధించిన కారణాలు, పెనాల్టీలు ఏడు రోజుల్లో తెలియజేస్తారు. 

ఇకపై పెనాల్టీలు, ఇతర అభ్యంత రాలు కోర్టులు, ట్రిబ్యునల్‌లలో దావా దాఖలుకు 25 శాతం పెనాల్టీ పన్ను లేదా క్లయిం విలువను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా తుది సప్లయ ర్‌కు జీఎస్టీ ఇన్వాయిస్‌ను, డెబిట్‌ నోటు విధిగా మొదటి సరఫరా దారు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తి, వ్యాపార సంస్థలను జీఎస్టీ 12 శాతం శ్లాబులోకి; కేంద్ర పరోక్ష పన్నుల, సుంకాల పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం కేంద్ర ఉద్దేశం.


పొనకా జనార్దన్‌రెడ్డి 
వ్యాసకర్త ఏపీ హైకోర్టు న్యాయవాది, తాడేపల్లి
మొబైల్‌: 83094 09689

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top