Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం

Cartoonist Mohan Death Anniversary: CNS Yazulu Tribute - Sakshi

బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్‌ మోహన్‌.

తాడి మోహన్‌ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్‌ మోహన్‌ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్‌ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్‌ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని  కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్‌ మార్చ్‌ కాన్వాస్‌లు! మోహన్‌ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్‌!

ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్‌లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్‌. తెలుగునాట పొలిటికల్‌ కార్టూన్‌ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్‌. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్‌ నుండి నేటి కేసీయార్‌ వరకు మోహన్‌ కార్టూన్‌ బారిన పడని నేత లేరు.

మోహన్‌ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్‌ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్‌ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?)

ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్‌ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్‌ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్‌!

– సీఎన్‌ఎస్‌ యాజులు
(సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్‌ వర్ధంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top