TTD Brahmotsavam 2022: శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...

TTD Brahmotsvam Special Day Importance Lord Venkateshwara Darshanam - Sakshi

అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. నిత్యం వేలాది భక్తులు శ్రీనివాసుని దర్శనార్థం తిరుమలకు తరలి వస్తుంటారు.  కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని కళ్లారా దర్శించుకోవాలన్నది భక్తులందరి కోరిక. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు ఏడుకొండలకు చేరుకుంటారు.

గంటల తరబడి క్యూ లైన్‌లలో వేచి ఉండి, క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతారు. కేవలం క్షణమైనా సరే, శ్రీవారి దర్శనం దక్కితే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇదివరకు వారాంతంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. మంగళ, బుధవారాలలో భక్తుల తాకిడి అతి తక్కువగా ఉండేది.

గురువారం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పుంజుకుని శుక్ర, శని, ఆదివారాల్లో బాగా పెరిగేది. తిరిగి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తూండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రోజులతో సంబంధం లేకుండా, ప్రతిరోజూ వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో వారాంతం స్థాయిలో కాకున్నా, మిగిలిన రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల కారణంగా ఏరోజు దర్శనం చేసుకుంటే, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయన్న అంశంపై భక్తులు దృష్టి పెట్టకుండా, స్వామివారి దర్శనభాగ్యం దక్కితే చాలన్నట్లుగా ఎప్పుడు కుదిరితే అప్పుడే భక్తులు వస్తున్నారు. అయితే, శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే, ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం...

శ్రీనివాసుడిని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధి నేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రునాశనం, నేత్ర, శిరోబాధల నుంచి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూలత, తల్లికి, సోదరీమణులకు శుభం, వారి నుంచి ఆదరణ, భార్యతో అన్యోన్యత కలుగుతాయి.

పౌర్ణమినాడు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలలో కార్యసిద్ధి, భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. బుధవారం దర్శించుకుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజిక గౌరవం లభిస్తాయి.

గురువారం దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురువుల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు, వాహన సౌఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. ఇక శనివారం శ్రీవారిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top