నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ

Health Tips Of Gynecology Doctor Bhavana Kasu  - Sakshi

నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్‌ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్‌ కౌన్సెలింగ్‌ తీసుకుంటే నాకేమైనా హెల్ప్‌ అవుతుందా?
– ఎన్‌కేఎస్, గుంటూరు

మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్‌ కపుల్‌ జెనిటిక్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్‌సెప్షనల్‌ జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్‌ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్‌ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్‌ జెనెటిక్‌ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్‌ డిసీజెస్‌ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్‌ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్‌ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్‌ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

అది క్యారియర్‌గా కపుల్‌కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్‌ ఎంత ఉందో చెప్తారు క్యారియర్‌ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్‌ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్‌ టెస్ట్స్‌ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్‌ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్‌ టెస్ట్స్‌కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్‌ ఫైబ్రోసిస్, సికిల్‌ సెల్‌ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. 

 నాకు 43 ఏళ్లు. పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావడంలేదు. స్కానింగ్‌ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్‌ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా?
– జి. ప్రసన్నకుమారి, కోటగిరి

మెనోపాజ్‌ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్‌గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్‌.. అంటే మెనోపాజ్‌ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్‌ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్‌ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్‌ అంటారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో గర్భసంచి లైనింగ్‌ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్‌ లేకపోవడం..

మెనోపాజ్‌ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్‌ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్‌స్వింగ్స్‌ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్‌ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్‌ఎమ్‌ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్‌ హైపర్‌ప్లాజియా అంటారు. అందుకే  40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్‌హెచ్, థైరాయిడ్‌ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. 

డా‘‘ భావన కాసు 
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top