బ్యాంకులే కాదు పాఠకుల మనసులూ దోచుకున్నాడు!

Not only banks Love gain Readers also - Sakshi

‘దబాంగ్‌’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన సోనాక్షి సిన్హాకు ఇష్టమైన పుస్తకం శాంతారామ్‌. ‘థ్రిల్లింగ్, ఫిలాసఫికల్, రొమాంటిక్, ట్రాజెడీ, ఒక జీవితానికి సంబంధించిన ఎత్తుపల్లాలు చూపించే మల్టీ–ఫేస్‌డ్‌ ప్లాట్‌ ఇది’ అంటోంది సోనాక్షి. ‘శాంతారామ్‌’ సంక్షిప్త పరిచయం...

ది జరిగిన కథ కాదు. అలా అని జరగని కథ కాదు. రచయిత స్వీయఅనుభవాలకు కల్పన జోడించి కమర్శియల్‌ ఫార్మట్‌లో రాసిన నవల ఇది. ‘శాంతారామ్‌ అనేది ఆటోబయోగ్రఫీ కాదు. పక్కా నవల. ఒకవేళ ఇది ఆటోబయోగ్రఫీ అనే భావన కలిగిస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది!’ అంటాడు రచయిత డేవిడ్‌ రాబర్ట్స్‌. ఇక కథలోకి వద్దాం...

ఆస్ట్రేలియాలోని పెన్‌ట్రిడ్జ్‌ జైలు నుంచి తప్పించుకొని ఇండియాకు పారిపొయి బాంబేలో తేలుతాడు బ్యాంక్‌ రాబర్‌ డేవిడ్‌. బాంబేలో అతనికి మొదట పరిచయమైన వ్యక్తి ప్రభాకర్‌. మొదట తనకు గైడ్‌గా సహాయపడిన ప్రభాకర్‌  ఆతరువాత మంచి స్నేహితుడవుతాడు. తనకు ‘లిన్‌బాబా’ అని పేరు పెడతాడు. ‘లిన్‌’ అని పిలుచుకుంటాడు. ‘జిలుగువెలుగుల బాంబే కాదు....మరో బాంబే కూడా ఉంది’ అంటూ బాంబే మురికివాడల జీవితాన్ని పరిచయం చేస్తాడు ప్రభాకర్‌. అంతే కాదు తన స్వగ్రామం ‘సుందర్‌’కు తీసుకువెళతాడు. ఆ ఊళ్లో బీదరికం తాండవించినా కోట్ల కంటే విలువైన సౌందర్యం ‘లిన్‌’ను ఆకట్టుకుంటుంది. ప్రభాకర్‌ తల్లి డేవిడ్‌కు ‘శాంతారామ్‌’ అని పేరు పెడుతుంది. ఆ పేరు విలువ తెలుసుకొని మురిసిపోతాడు లిన్‌.

బాంబే వచ్చిన తరువాత ఒక బార్‌లో డబ్బుతో పాటు తన రెక్కలు ‘నకిలీ పాస్‌పోర్ట్‌’ కూడా పోగొట్టుకుంటాడు. ఇక చచ్చినట్లు బాంబేలో ఉండాల్సిందే!  బాంబేలోని స్లమ్‌ ఏరియాలో చిన్న షెడ్డులో మకాం పెడతాడు. ఒకరోజు ఆ ఏరియాలో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఎంతోమందిని రక్షించడమే కాదు వారికి తానే స్వయంగా వైద్యం చేస్తాడు. ఆ తరువాత కూడా తనకు తెలిసిన వైద్యంతో అక్కడి జనాలకు సహాయపడుతూ అనధికార డాక్టర్‌ అవుతాడు. వచ్చే పోయే పేషెంట్లతో అతడి షెడ్డు చిన్నపాటి ‘క్లీనిక్‌’ అవుతుంది. వైద్యం కోసమే కాదు రకరకాల విషయాల్లో సలహా కోసం అతని దగ్గరికి వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. స్లమ్‌ ఏరియాలో శాంతారామ్‌ హీరోగా ఎదుగుతున్న విషయం క్రిమినల్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఖాన్‌కు తెలిసి పరిచయం చేసుకుంటాడు.

‘పేద ప్రజలకు  నువ్వు చేస్తున్న సహాయం నాకు బాగా నచ్చింది’ అని వేనోళ్ల పొగుడుతాడు. అలా మంచిచేసుకున్న తరువాత మెల్లగా శాంతారామ్‌ను బ్లాక్‌మార్కెట్‌ దందాలోకి లాగుతాడు. ప్రత్యర్థి ఒకరు చేసిన కుట్ర వల్ల శాంతారామ్‌ అరెస్ట్‌ అవుతాడు. బాంబే జైల్లో చిత్రహింసలు అనుభవిస్తాడు. ఖాదర్‌ అతడిని జైలు నుంచి విడిపించి బయటికి తీసుకువస్తాడు. ఇక అప్పటి నుండి ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా మారుతాడు. దేశమంతా తిరుగుతాడు. తనకు అత్యంత సన్నిహితుడైన భాస్కర్‌ చనిపోవడంతో శాంతారామ్‌ ఒకలాంటి వైరాగ్యస్థితిలోకి వెళ్లిపోతాడు.

రామ్‌ను మళ్లీ మామూలు జీవితంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఖాదర్‌ ‘కార్లా’ అనే అమ్మాయికి ఇస్తాడు. బాలీవుడ్‌ సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసే కార్లాను బాంబే అండర్‌ వరల్డ్‌ రకరకాల క్రిమినల్‌ ఆపరేషన్స్‌లో పావుగా ఉపయోగించుకుంటారు. ఎట్టకేలకు కార్ల వల్ల మళ్లీ మూమూలు జీవితంలోకి వస్తాడు శాంతారామ్‌. ఆఫ్గనిస్థాన్‌లో తీవ్రవాదులకు సహకారం  అందించడానికి ఖాదర్‌ శాంతారామ్‌ను తీసుకువెళతాడు. అక్కడ ఖాదర్‌ హత్యకు గురవుతాడు. శాంతారామ్‌ చావు తప్పి కన్ను లొట్ట పోయే పరిస్థితుల్లో  ఇండియాకు పారిపోయి వస్తాడు. నేరాల బాట వీడి నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంటాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top